సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వచ్చే నెల నుంచి పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకం కానున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా జనంలోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేర కు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్ వచ్చేనెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
కోలుకుంటున్న కేసీఆర్: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో గత నెల 8న తుంటి ఎముక గాయంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ప్రస్తుతం నందినగర్‌లోని తన నివాసంలో కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు పరిమిత సంఖ్యలోనే సన్నిహితులు, పార్టీ నాయకులు ఆయన్ను కలుస్తున్నారు. మరో మూడు నుంచి నాలుగు వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్‌ను స్వయంగా పరామర్శించేందుకు గత నెల రోజులుగా పార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండగా, కేడర్ కూడా అధినేతను చూసేందుకు ఎదురు చూస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శించింది. ఈ నెల 3నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లోక్‌సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రీ ఎంట్రీ పారీ్టకి మరింత జోష్ తెస్తుందని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
భారీ స్వాగత సన్నాహాలు
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్షేత్ర స్థాయిలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది. జంట నగరాల్లో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొలిసారిగా జనం మధ్యకు వస్తుండటంతో ఆ మేరకు ఘనంగా స్వాగత సన్నాహాలు చేయాలని పార్టీ భావిస్తోంది. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ కాన్వాయ్‌తో కేసీఆర్‌ను తోడ్కొనిరానున్నారు. మరోవైపు కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వందల సంఖ్యలో ముఖ్య నేతలు హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ నేతలు, కేడర్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది.
వచ్చే నెల 20 తర్వాత గజ్వేల్‌కు..
గజ్వేల్ ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా గెలుపొందిన కేసీఆర్ వచ్చే నెల 20 తర్వాత నియోజకవర్గ పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఇకపై రెగ్యులర్‌గా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా గజ్వేల్‌లో కూడా భారీగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయనున్నారు. తొలి పర్యటనలో నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభివృద్ధి పనులపైనా అధికారులతో చర్చిస్తారని సమాచారం.
వరంగల్‌లో భారీ బహిరంగ సభ!
పార్టీ కార్యకలాపాలను ఇకపై తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కూడా ఇక్కడే జరపనున్నారు. పార్టీ కార్యాలయంలోనే నాయకులు, కేడర్‌తో వరుస భేటీలు జరిపేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 22న పార్టీ లోక్‌సభ సన్నాహక సమావేశాలు ముగియనుండగా, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ ఇదే తరహా మీటింగ్‌లు జరగనున్నాయి.
ఒకవైపు విశ్రాంతి తీసుకుంటూనే మరోవైపు వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడుతూ క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఉద్యమ కాలంలో తనతో కలిసి పనిచేసిన వివిధ వర్గాలకు చెందిన నేతలతోనూ మాట్లాడుతూ త్వరలో అందుబాటులో ఉంటానని చెప్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అనేకమార్లు తేదీలు ప్రకటించినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వెలువడేలోపు బీఆర్‌ఎస్ సత్తాను చాటేలా అక్కడ భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment