తెలంగాణ రక్షణ కోసమే గులాబీ జెండా పుట్టింది: కేసీఆర్‌ | BRS chief KCR in Telangana Formation decade celebrations | Sakshi
Sakshi News home page

తెలంగాణ రక్షణ కోసమే గులాబీ జెండా పుట్టింది: కేసీఆర్‌

Published Mon, Jun 3 2024 4:55 AM | Last Updated on Mon, Jun 3 2024 4:55 AM

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరిస్తున్న  కేసీఆర్‌. చిత్రంలో మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్, పల్లా, తలసాని తదితరులు

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరిస్తున్న కేసీఆర్‌. చిత్రంలో మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్, పల్లా, తలసాని తదితరులు

ఎన్నికల్లో జయాపజయాలు ముఖ్యం కాదు.. ప్రజల ప్రయోజనాలే ప్రధానం..

తుది శ్వాస వరకూ తెలంగాణ కోసమే పనిచేస్తా.. 

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

అన్ని వర్గాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసింది

ఈ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి

మొన్న ఓడగొట్టినోళ్లే ఇప్పుడు ‘అన్నంల మన్ను పోసుకున్నట్లు అయిపాయే’ అనుకుంటున్నరు

ప్రజల్లో ఉన్న అసంతృప్తి సమయం వచ్చినప్పుడు బాంబు పేలినట్లు పేలుతుంది.. సమీప భవిష్యత్తులో పాలన మన భుజాలపైనే పడుతుంది

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చేది బీఆరెస్సే..

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎన్నికల్లో జయాపజయాలు మనకు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజల ప్ర­యో­జనాల పరిరక్షణే ప్రధానం. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టిన ప్రజలే ఇప్పుడు అన్నంల మన్ను పోసుకున్నట్లు అయిపాయే  అనుకుంటున్నరు. అనతి కాలంలోనే అప్రతిష్ట పాలైన ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. రీప్లేస్‌మెంట్‌ మనమే. 

ప్రజల్లో ఉన్న అసంతృప్తి సమ­యం వచ్చినప్పుడు బాంబు పేలినట్లు పేలుతుంది. అది ఎంతో దూరం ఉందని నేననుకోవ­డం లేదు. సమీప భవిష్యత్తులో మళ్లీ పాలన మన భుజాల మీదనే పడుతుంది. తెలంగాణకు భవిష్యత్తు బీఆర్‌ఎస్‌ జెండానే ..’అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నా­రు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భా­గంగా ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో భారీ ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు.  

సరైన పంథా లేక 1969 ఉద్యమం విఫలం 
‘నాడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ 1969 ఉద్యమం సరైన పంథా లేకపోవడంవల్ల ఘోరంగా విఫలమైంది. 1969 ఉద్యమంలో ముల్కీ రూల్స్‌ ప్రధాన అంశంగా ఉండేవి. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను ఇక్కడి నుంచి పంపించాలని ఇక్కడి యువత పోరాటం చేశారు. అయితే ముల్కీ రూల్స్‌ వ్యతిరేక పోరాటంలో రాజ్‌భవన్‌ దగ్గర 8 మంది విద్యార్థులను కాల్చి చంపారు. ఉద్యమం సమసిపోయింది. తెలంగాణ రాలేదు. ఆ తర్వాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. 

ముల్కీ రూల్స్‌ ఉద్యమం లీగల్‌ బ్యాటిల్‌గా సుప్రీంకోర్టుకు వెళ్లింది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో 1973లో ముల్కీ రూల్స్‌ కొనసాగుతాయని తెలంగాణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. దాంతోటి ఆంధ్రాలో వెంటనే జై ఆంధ్రా ఉద్యమం మొదలుపెట్టిన్రు. ఆ తర్వాత కేంద్రం సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. ముల్కీ రూల్స్‌ను రద్దు చేసింది. ఇంత చేసినా తెలంగాణ నుంచి ఎవరూ నోరు మెదపలే. మారు మాట్లాడలే..’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

నాటి ఘోరాలకు జయశంకర్‌ సార్‌ సాక్షి 
‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆజన్మ తెలంగాణ వాది. ఆయన లాంటి మనుషులు అరుదుగా ఉంటారు. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. తెలంగాణ అస్తిత్వం కోల్పోవద్దని, తెలంగాణగనే ఉండాలని నిర్ణయించుకుని పోరాట పంథా ఎంచుకున్నారు. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి పిలిచి బెదిరించినా జయశంకర్‌ సార్‌ బెదరలేదు. పోరాట పంథాను వీడలేదు. అలా అనేక సందర్భాల్లో ఆయన బెదిరింపులను ఎదుర్కొన్నారు. 

తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని అణచడం కోసం నాటి ప్రభుత్వాలు చేసిన ఘోరాలు అన్నింటికీ ఆయన సాక్షి. 1969 ఉద్యమంలో చాలామంది పెద్దలు పోరాటం చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన విజయసింహారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి పోరాటంలో అగ్రభాగాన ఉండేవారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1969లో ఇక్కడి పాలిటెక్నిక్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ విద్యార్ధిగా ఉంటూ అనేకసార్లు లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లారు. ఇలా అనేక మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు. వాళ్లందరికీ మనం తలెత్తి మొక్కాల్సిందే..’అని బీఆర్‌ఎస్‌ అధినేత చెప్పారు.  

తెలంగాణ పదాన్ని అసెంబ్లీ వాడొద్దన్నారు 
‘2001లో తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పటికీ 1999 నుంచే చర్చోపచర్చలు జరిగాయి. తెలంగాణ వాదులు, మేధావులతో కలిసి ఉద్యమ పంథాపై ప్రణాళికలు తయారు చేశాం. పదవులకు రాజీనామా చేసి పార్టీ పెడితే పది మంది వెంటలేరు. అప్పుడు మీటింగ్‌లు పెట్టినా పది, పదిహేను మంది కూడా వచ్చేవారు కాదు. తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవులు చూసుకున్నారు. అసెంబ్లీలో తెలంగాణ పదం వాడొద్దని అప్పటి స్పీకర్‌ ప్రణయ భాస్కర్‌ చెప్పారు. 

వెనుకబడిన ప్రాంతం అనాలని శాసనసభముఖంగా వ్యాఖ్యానించారు. కనీసం నీళ్ల కోసం మాట్లాడిన వాళ్లు కూడా లేరు. నేను పాలమూరులో సభ పెట్టి పోరాటం చేస్తే అప్పుడు జూరాలకు నీళ్లు వచ్చాయి. కరీంనగర్‌లో సింహగర్జనను సూపర్‌ డూపర్‌ హిట్‌ చేశాం. సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఉండాలని నేను నిలదీస్తే ప్రభుత్వం దిగి వచ్చింది. తెలంగాణ వస్తుందని ఎవరూ ఊహించలేదు. 15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది..’అని కేసీఆర్‌ తెలిపారు. 

బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల మహా వృక్షం 
‘బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తమని అంటున్నరు. మోకాలంత ఎత్తు లేనోడు కూడా మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల మహావృక్షం. ఖతం చేస్తే ఖతమైతదా? కాంగ్రెస్‌ పదేళ్లు అధికారంలో లేదు. ఖతమైందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం ఉంది. కానీ నేను బస్సు యాత్ర మొదలు పెట్టంగనే మళ్లీ అదే గర్జన కనిపించింది. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాం. 

మరో ఎమ్మెల్సీగా రాకేశ్‌రెడ్డి గెలువబోతున్నడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ గెలిచేది బీఆరెస్సే. 105 సీట్లు వస్తయని ఒకాయన మొన్న వచ్చి చెప్పిండు. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఒకడు 11 వస్తయన్నడు. ఇంకొకడు ఒకటే వస్తదన్నడు. రెండు నుంచి మూడు వస్తయని ఇంకో ఆయన అన్నడు. 11 వస్తే పొంగిపోయేది లేదు. తక్కువ వస్తే కుంగిపోయేది లేదు. ఎలక్షన్లు చాలా చూసినం. ఏదేమైనా భవిష్యత్తు మనదే...’అని మాజీ సీఎం చెప్పారు.  

కాంగ్రెస్‌ వాళ్లకు పాలన తెలియదు 
‘నోటికి హద్దు లేకుండా హామీలు ఇచ్చిన్రు. ఆరునెలల్లో అంతా తలకిందులైంది. కళ్యాణలక్ష్మి, రైతుబంధు, కేసీఆర్‌ కిట్, దళితబంధు అన్నీ బందయ్యాయి. గీత కార్మికులను వేధిస్తున్నారు. కల్లు గీసి అమ్ముకునే గౌడలను జైళ్లల్ల పెడుతున్నారు. ఒకరు కాదు అన్ని వర్గాలను కాంగ్రెస్‌ మోసం చేసింది. ఇంత తొందరగ రావద్దు. కానీ అనతికాలంలోనే ఈ ప్రభుత్వం అప్రదిష్టపాలైంది. ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్‌ వాళ్లతో ఏంకాదు. వారికి పాలన తెలియదు. అనుభం లేదు. అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్ల మలుచుకోవాలో తెలుస్తలేదు..’అని కేసీఆర్‌ విమర్శించారు.  

లోగో ప్రజల గుండెల మీద ఉంటది 
‘రాష్ట్ర ప్రభుత్వ లోగో ప్రజల గుండెల మీద ఉంటది. అప్పట్లో ఏం చేసినా, పదులు, వందల సంఖ్యలో కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకునే వాళ్లం. సమిష్టి నిర్ణయంతో చేసినం. దేవుడిచ్చిన ఆయుష్షు, చివరి శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసమే పనిచేస్తా..’అని కేసీఆర్‌ అన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement