ప్రజలకు ఏం చేశారు.. సీఎంను హెలికాప్టర్‌ అడగలేరా?: జగదీష్‌ రెడ్డి ఫైర్‌ | BRS Jagadesh Reddy Serious Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఏం చేశారు.. సీఎంను హెలికాప్టర్‌ అడగలేరా?: జగదీష్‌ రెడ్డి ఫైర్‌

Published Mon, Sep 2 2024 8:00 PM | Last Updated on Mon, Sep 2 2024 8:23 PM

BRS Jagadesh Reddy Serious Comments On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మండిపడ్డారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినా రాలేదని ఓ మంత్రి చెప్పడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

కాగా, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 20 జిల్లాల్లో వర్షం ప్రభావం ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్ర పోయింది. గంటల తరబడి బాధితులు ప్రభుత్వం సహాయం కోసం చూశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. సీఎం నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేశారు?. ప్రజలే రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినా రాలేదని ఓ మంత్రి చెప్తున్నారు. మంత్రిగా మీరు ఫెయిల్యూర్ అయ్యారు.. రాజీనామా చేయండి.

హెలికాప్టర్ మాట్లాడకుండా నిన్న ముఖ్యమంత్రి ఏం చేశారు. ఖమ్మంలో సహాయం కోసం ప్రజలు 9 గంటలు వేచి చూసినా సహాయం అందలేదు. ఒక మంత్రి హెలికాప్టర్ కోసం ఏపీ సీఎంతో మాట్లాడాను అని అంటున్నారు. తెలంగాణ సీఎంతో ఎందుకు మాట్లాడలేదు. వర్షాలపై సీఎస్ హెచ్చరికను ఫాలో అయ్యి సీఎం, మంత్రులు బయటకు రాకుండా ఉన్నారా?. పరిపాలన మాకు చేతకావడం లేదని మంత్రులు అంటున్నారు. ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదు. సీఎంతో అమిత్ షా, మోదీ మాట్లాడితే తెలంగాణకు హెలికాప్టర్ కావాలని ఎందుకు అడగలేదు.

 

ప్రభుత్వం వైపు నుండి హెచ్చరికలు ఉంటే ప్రజలు బయటకురారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. మంత్రులు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ దొరుకుతుంది కానీ ప్రజలకు హెలికాప్టర్ దొరకదా?. వర్షాలతో సంభవించిన మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25లక్షల రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడుగా అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలని కోరుతున్నాం. బాధితులకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ప్రజల మధ్యన ఉండాలి. నిన్న జరిగిన సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం సోయితో పని చేయాలి. వరదలపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్లో ఒక్క రాజకీయ పదం కనిపించిందా?. ఖమ్మంలో ప్రజలు గజ ఈతగాళ్లకు డబ్బులు ఇచ్చి ప్రాణాలు రక్షించుకున్నారు. కోదాడలో ఎవరి హయాంలోకబ్జాలు జరిగాయో ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చకు సిద్దం’ అని సవాల్‌ విసిరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement