సాక్షి, జనగామ: జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని చైతన్యపురిలోని నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సంపత్‌రెడ్డిని నగరంలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే సంపత్‌రెడ్డి మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్‌లో సంపత్‌రెడ్డి కుమారుడు మృతి చెందాడు.
ఇటుక బట్టీల వ్యాపారం చేసే సంపత్‌రెడ్డి 2004లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో చిల్పూర్ మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. తర్వాత జెడ్పీ చైర్మన్ అయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఉంటూనే జనగామ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంపత్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన రాజవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహాన్ని స్వగ్రామం రాజవరానికి తీసుకెళ్లి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రేపు నివాళులర్పించనున్న కేసీఆర్..
జనగామ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, జిల్లా జెడ్పీచైర్మన్ సంపత్‌రెడ్డి మృతి పట్ల బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మంగళవారం కేసీఆర్ జనగామకు వెళ్లి సంపత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.
ఒకే ఏడాదిలో రెండో జెడ్పీచెర్మన్..
ఇదే ఏడాది జూన్‌లో ములుగు జిల్లా జెడ్పీచైర్మన్, జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి చెందారు. ఈయన కూడా బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో నడిచిన వారిలో ఒకరు. జగదీష్ మృతి చెందినపుడు బీఆర్‌ఎస్ పార్టీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన నుంచి కోలుకోక ముందు తొలి నుంచి పార్టీలో ఉన్న మరో జెడ్పీచైర్మన్, జిల్లా అధ్యక్షుడిని సంపత్‌రెడ్డి రూపంలో కోల్పోవడం బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలను కలవర పరుస్తోంది.
ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment