సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తన కుమారుడికి పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటారని పేర్కొన్నారు. జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేవి సహజమని చెప్పారు. రేవంత్, బండి సంజయ్‌కు రాష్ట్రంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని అన్నారు.
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు 2018 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుండా కూటమి అని కేసీఆర్ అన్నారని, అందుకే విపక్ష సమావేశాలకు కేసీఆర్ వెళ్లడం లేదని తెలిపారు. వేముల విరేశం కాంగ్రెస్‌లోకి వెళ్తారనేది అవాస్తమని పేర్కొన్నారు. వారసుల కోసం తాము వేరే పార్టీలోకి వెళ్లమని, అవకాశం రాకపోతే పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలు కేవలం గుర్తింపు వరకు మాత్రమే పనిచేస్తాయని.. గెలుపు కోసం పనికిరావని అన్నారు.
‘రేవంత్ రెడ్డి మాటలకు అంతూ పొంతు ఉండదు. రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా? రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చాడు. ఫిరాయింపులు ఆపేందుకు చట్టం తేవాల్సింది కేంద్రమే. అలాంటి కేంద్రమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందే తప్ప ఒక్క న్యాయం చేయలేదు. రెండు రాష్ట్రాల విభజన హామీలు కేంద్రం పరిష్కరించడంలో విఫలం అయింది’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం సున్నా: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment