నీ పక్కన ఉన్నవారు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో
ఆ తర్వాత మమ్మల్ని డీల్ చేసే విషయం ఆలోచించు
సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు కౌంటర్
ఐదేళ్ల తర్వాత నిన్నెలా డీల్ చేయాలో మాకు తెలుసు
మూసీ పాదయాత్రకు నేనూ,కేటీఆర్ రెడీ..డేట్, టైం చెప్పు
మీడియాతో ఇష్టాగోష్టిలో మాజీమంత్రి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్‌రెడ్డీ.. ముందు నీ కుర్చీకింద ఉన్న బాంబు గురించి చూసుకో.. నీ పక్కన ఉన్నవారు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో.. నీ మంత్రులే నిన్ను ముంచుతారు. ఒకరేమో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. మరొకరు ఢిల్లీలో అధిష్టానం వద్దకు రహస్యంగా వెళ్లివస్తున్నారు. మరొకరు హెలికాప్టర్ ఇవ్వలేదని అలిగారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను డీల్ చేయడం తర్వాత.. ముందు నీవు ఐదేళ్లు పదవిలో ఉండేలా చూసుకో.. ఐదేళ్ల తర్వాత నిన్ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు.
ఏడాది అవుతోంది.. మంత్రివర్గ విస్తరణ చేసుకోలేవు. కనీసం చీఫ్‌విప్, డిప్యూటీ స్పీకర్‌ను నియమించుకోలేకపోయావు..’అని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ను వాడుకొని కేసీఆర్‌ను ఫినిష్ చేశానని, బావను ఉపయోగించి బామ్మర్దిని ఫినిష్ చేయిస్తానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
నీకు సీఎం పదవి కేసీఆర్ భిక్షే
‘నీ సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షే. నీకు, కేసీఆర్‌కు పోలికా? నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన త్యాగశీలి, సాధనాపరుడు. ఆయన ఉద్యమం చేసి తెలంగాణ తేకుంటే నీవు సీఎం అయ్యేవాడివే కాదు. నోరు తెరిస్తే అబద్ధాలు. నిన్ను చూస్తే గోబెల్స్ కూడా సిగ్గుపడేవాడు. ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. రుణమాఫీ పాక్షికంగానే చేశావు. 31 రకాల కోతలతో రుణమాఫీని గణనీయంగా తగ్గించావు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గోల్ చేసేది, వికెట్ తీసేది మేమే. కేసులకు భయపడం. హామీలు ఎగవేసిందుకు నేను సీఎంను ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటే నాపై బేగంబజార్ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు. బుల్డోజర్లు నడిపించి చంపేస్తామని సీఎం అంటే ఆయనపై మాత్రం కేసు నమోదు చేయడం లేదు..’అని హరీశ్ అన్నారు.
కూల్చివేతలు, కమీషన్లకే వ్యతిరేకం
‘మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్ల కూల్చివేత, రియల్ ఎస్టేట్‌కు అప్పగించడం, కమీషన్లకు మాత్రమే వ్యతిరేకం. టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి వాడపల్లి వరకు పాదయాత్రకు నేను, కేటీఆర్ రెడీ.. తేదీ, సమయం చెప్పు. ఎవరూ లేకుండా వెళ్దాం. మల్లన్నసాగర్ కోసం 50 వేల ఎకరాలు ముంపునకు గురైందంటూ అన్నీ అసత్యాలే చెప్పావు.
మేము సేకరించిందే 17 వేల ఎకరాలు. అందులో 3 వేలకు పైగా ప్రభుత్వ భూమి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు మేం 2013 భూ సేకరణ చట్టం కంటే ఎక్కువ ఇచ్చాం. అయినా తక్కువ ఇచ్చామని ఆరోపించారు కదా.. అంతకంటే ఎక్కువ మీరు మూసీ నిర్వాసితులకు ఇవ్వండి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎందుకు? గచ్చిబౌలిలో 250 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వండి. వారి ఉపాధికి ఒక్కో కుటుంబానికి రూ.7.5 లక్షలు ఇవ్వండి. పెళ్లి కానివారికి రూ.5 లక్షలు, ఇంటి స్థలం ఇవ్వండి.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయలేవు. సందర్శకులు రాకుండా తాళం వేశావు. ఇప్పుడు మూసీలో మహాత్మాగాంధీ విగ్రహం పెడ్తానంటున్నావు. మూసీ సుందరీకరణకు కేసీఆర్ ముందే ప్రణాళికలు వేశారు. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీలోకి తీసుకుని రావడానికి రూ.1100 కోట్లతో ప్రణాళిక చేస్తే.. నీవు మరింత దూరం వెళ్లి మల్లన్నసాగర్ అంటూ రూ.7,000 కోట్లకు పెంచావు. ఎందుకంటే నీ కమీషన్ల కోసం..’అని మాజీమంత్రి ఆరోపించారు.
రియల్ ఎస్టేట్ ఢమాల్
‘సీఎం నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. అదే సమయంలో ఢిల్లీ, ముంబయి, బెంగుళూరులో పెరుగుతోంది. బీఆర్‌ఎస్ హయాంలో రూ.4.86 లక్షల కోట్లు అప్పు చేస్తే, రూ.7.50 లక్షల కోట్ల అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే రూ. 80 వేల కోట్ల అప్పు చేశారు..’అని హరీశ్‌రావు తెలిపారు. బెటాలియన్ పోలీసుల డిస్మిస్‌లు, సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏక్ పోలీస్ హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తే పిలిచి చర్చించకుండా సస్పెండ్, డిస్మిస్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment