సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్
కబ్జాల చరిత్ర రేవంత్ కుటుంబీకులదే
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమని ధ్వజం
వట్‌పల్లి (అందోల్): రంగనాయక్ సాగర్ వద్ద ఇరిగేషన్ భూములను తాను ఆక్రమించలేదని, రైతుల వద్ద 13 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. దమ్ముంటే కబ్జాలను నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం అందోల్ మండల పరిధిలోని మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. పేదల భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసే అలవాటు తమకు లేదని, అటువంటి చరిత్ర రేవంత్‌దేనన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించగా, పౌరసరఫరాల శాఖ కమిషనర్ మాత్రం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారని, దీంతో మిగతా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దళారుల పాలైందని అన్నారు.
ఈ సీజన్‌లో 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితిలేదన్నారు. బోనస్ మాట దేవుడెరుగు మద్దతు ధర కంటే రూ.500 తక్కువకు రైతులు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, గిరిజనుల భుములను కంపెనీల పేరుమీద కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ ప్రశ్నించేవారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలు జరిగేదాకా కేసీఆర్ నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీజీటీపీసీ మాజీ చైర్మన్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment