ఏసీబీ లాంటి మీ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతిస్తా
చాయ్ బిస్కెట్లు ఇస్తా.. మీ బర్త్‌డేకు కేక్ కట్ చేస్తానంటే ఇప్పిస్తా
సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు
మూసీ ప్రాంతంలో పాదయాత్ర చేసే దమ్ముందా అని నిలదీత
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి గారూ.. అరెస్టు భయంతో మలేసియాకు పారిపోయానంటూ మీ అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. ఏసీబీలాంటి మీ ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతం పలుకుతా. వారికి చాయ్‌తోపాటు ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా. మీ బర్త్‌డే సందర్భంగా వారు కేక్ కట్ చేస్తానంటే నేను ఇప్పిస్తాను’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ ‘ఎక్స్’లో సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు చేశారు. ‘సీఎంకు హ్యాపీ బర్త్‌డే.. నా అరెస్టు కోసం ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో మీరు ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’అంటూ సంబోధించిన సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టగలరా. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నుంచి ఆంధ్రా కాంట్రాక్టర్‌ను తొలగించే దుమ్ముందా. సీఎం హోదాలో ఒక కాంట్రాక్టు సంస్థకు గులాంగిరి చేస్తున్నావా’అని కేటీఆర్ మండిపడ్డారు.
పుండు ఒక చోట.. మందు మరోచోట
‘మూసీ ప్రాజెక్టు బాధితులను పట్టించుకోకుండా మరోచోట సీఎం పాదయాత్ర చేస్తూ పుండు ఒక చోట అయితే మందు మరోచోట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వేల ఇళ్లను కూల్చివేసేందుకు ప్రణాళికలు వేసి..లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే ప్రణాళిక వేసిన సీఎం దొడ్డిదారిన మరోచోట పాదయాత్ర డ్రామా చేస్తున్నారు. లక్షలాది మంది ఆక్రందనలకు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్ మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేసే ధైర్యం, చిత్తశుద్ధి సీఎంకు లేదు.
దశాబ్దాలపాటు వ్యర్థాలు కలుస్తుంటే అరవై ఏళ్లు కళ్లుండీ చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ వ్యవహరించింది. మూసీ దోపిడీ ప్రాజెక్టు కన్సల్టెంట్లతో మూడురోజుల పాటు చర్చించే సమయం సీఎంకు ఉంది. కానీ ఆరు గ్యారంటీల అమలుపై సమీక్షించేందుకు సమయం లేదా. మోసపూరిత హామీలను పక్కన పెట్టి కమీషన్ల కోసం మూసీ ప్రాజెక్టును నెత్తిన పెట్టుకున్నారు. పాదయాత్ర చేసినా పొర్లుదండాలు పెట్టినా మూసీ పరీవాహక ప్రాంత ప్రజల వేదన మీకు శాపంగా మారుతుంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
నల్లగొండ నేతల అరెస్టు అక్రమం
ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతీ సందర్భంలో బీఆర్‌ఎస్ నేతలను ముందస్తు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురి చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, హామీల అమలులో వైఫల్యంపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం’అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment