
సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: వందలాది సంక్షేమ కార్యక్రమాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసినా ఏనాడూ ప్రజలను రోడ్ల మీద వరుసల్లో నిలబెట్టలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించామే తప్ప రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం గురించి ఆలోచించలేదన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మళ్లీ గెలిచేవాళ్లమని చెప్పారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ బీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాల ముందు బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి ఓడిపోయింది.
అధికారంలోకి వస్తామనే ఆశలు లేని కాంగ్రెస్.. నోటికొచ్చిన హామీలను ఇచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన బీఆర్‌ఎస్ నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు. కొత్తగా 6.47 లక్షల రేషన్‌కార్డులు, అత్యధిక వేతనాలు, 46 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినా ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదు. బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో మూడో వంతు సీట్లు రాగా, 14 స్థానాల్లో కేవలం 6 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయాం. కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌కు ఓట్ల తేడా కేవలం 1.85 శాతం మాత్రమే.
గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుంటాం. స్థానిక సంస్థలు మొదలుకుని అసెంబ్లీ ఎన్నికల దాకా బలమైన నాయకత్వం ఉంది. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు పార్టీకి అండగా ఉన్నారు’అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల పేరిట రేవంత్ రెడ్డి నాటకాలాడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే స్వేదపత్రం రూపొందించాం. అన్ని వర్గాలకు పార్టీ దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం’అని కేటీఆర్ చెప్పారు.
ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే: హరీశ్‌రావు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని భవిష్యత్తులో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ది చేసినా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసింది. రుణమాఫీ, ధాన్యానికి బోనస్ తదితరాలపై మాట తప్పి దగా చేశారు. విద్యుత్‌లో కొత్త విధానం అంటే విద్యుత్‌ను 48 గంటలు ఇస్తారా. లోక్‌సభ ఎన్నికల్లో సమష్టిగా కష్టపడదాం. నెల రోజుల్లో కేసీఆర్ తెలంగాణ భవన్‌లో ఉంటారు. కేడర్‌కు ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకుని మీ ముందుకొస్తాం.
కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసి కేడర్ పిల్లలకు సహకారం అందిస్తాం. అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు తెలంగాణ భవన్‌తోపాటు జిల్లా కార్యాలయాల్లోనూ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. మండల, జిల్లా కమిటీలు వేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన బీఆర్‌ఎస్‌కు గెలుపోటములు కొత్త కాదు. గల్లీలో ఎవరున్నా తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో కాపాడటం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుంది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌కు చూపింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో అప్పుడే కుమ్ములాటలు
కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయని, మంత్రి పొంగులేటి తానే నంబర్ 2గా చెప్పుకుంటున్నారని, డిప్యూటీ సీఎం భట్టి ముఖ్యమంత్రి పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ‘కేటీఆర్, హరీశ్‌రావు కృష్ణార్జునుల తరహాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలి. గతంలో ఎంపికైన దళిత బంధు లబి్ధదారులకు సాయాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం’అని కడియం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment