కొండా సురేఖ మెదడులేని విమర్శలు చేస్తోంది: మాజీ మంత్రి కేటీఆర్
చట్ట వ్యతిరేక వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు
చనిపోయిన రైతుల వివరాలు సీఎంకు పంపిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘నాకు ఎలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాలతో, ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంటూ లీకు వీరుడు రేవంత్‌రెడ్డి నా వ్యక్తిత్వ హననానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు మీడియా సమావేశం పెట్టి ఆధారాలు బయట పెట్టే దమ్ము లేదు. పోలీసు రిమాండులో ఉన్న వారి ఫోన్ల నుంచి కూడా లీకులు వస్తున్నాయి. నేను ఎవరో హీరోయిన్లను బెదిరించినట్లు మంత్రి కొండా సురేఖ మెదడు లేని విమర్శలు చేస్తోంది.
ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మనాకేంటి? ఎవరి ఫోన్లూ ట్యాపింగ్ చేయాల్సిన, బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. అడ్డగోలుగా చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాటతీస్తాం.. న్యాయపరంగా ఎదుర్కొంటాం..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ట్యాపింగ్‌పై 2004 నుంచే విచారణ జరిపించాలి
‘2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు, అప్పుడు ఎంపీలుగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. అందువల్ల విచారణ పరిధి పెంచి 2014 నుంచి కాదు 2004 నుంచి ట్యాపింగ్ అంశంపై విచారణ జరిపించాలి. పోలీసు అధికారులు మహేందర్‌రెడ్డి, శివధర్‌రెడ్డి, రవిగుప్తా తదితరులు 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీలక పోస్టుల్లో పనిచేశారు.
కేసీఆర్ మాత్రమే బాధ్యులు అని లీకులు ఇస్తున్నవారు ఆ ఆధికారులను ఎందుకు విచారణకు పిలవడం లేదు. గతంలో నా ఫోన్ మీదా నిఘా ఉన్నట్లు ఆపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంటూ యూ ట్యూబ్‌లు, పనికి మాలిన ఛానళ్లకు రిమాండు రిపోర్టు పేరిట లీకులు ఇస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం
‘రుణమాఫీపై వెకిలిగా నవ్వుతున్న రేవంత్‌రెడ్డి మొగోడు అయితే రైతులకు ఊరటనివ్వాలి. కాళేశ్వరం, గొర్రెలు..బర్రెల స్కీంలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అంటూ రోజుకో అంశం తెరమీదకు తెస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోని పక్షంలో ఇద్దరి పదవులు ఊడగొట్టేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లి న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన 218 మంది రైతుల వివరాలను వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి పంపిస్తాం. గతంలో ప్రకటించినట్టుగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నీటి నిర్వహణ చేత కావడం లేదు
‘రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి ధన వనరులు తరలిస్తున్న రేవంత్‌రెడ్డికి జలరాశులు తరలింపునకు ఓపిక లేదు. బీఆర్‌ఎస్ పాలనలో రూ.38 వేల కోట్లతో మిషన్ భగీరథ పూర్తి చేయడంతో పాటు హైదరాబాద్ నగరానికి వచ్చే 50 ఏళ్ల పాటు తాగునీతి కొరత రాకుండా చేశాం. రాష్ట్రంలో 14 శాతం అధిక వర్షపాతం నమోదైనా నీటి నిర్వహణ చేత కావడం లేదు. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే నాగార్జునసాగర్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, ఎల్లంపల్లిలో నీళ్లు ఉన్నా ప్రజలు ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాగునీటి కోసం ఢిల్లీని దేబిరించాల్సిన పరిస్థితిని రేవంత్ ప్రభుత్వం కల్పించింది.
బోనస్ ఇవ్వాల్సి వస్తుందని పంటలు ఎండబెట్టారు
కాళేశ్వరం నీళ్లను దాచి పెట్టడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. మేడిగడ్డకు మరమ్మతులు చేసి ఉంటే సాగు, తాగునీటి కష్టాలు ఉండేవి కావు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే పంటలను ప్రభుత్వం ఎండబెట్టింది. కాంగ్రెస్‌కు హైదరాబాద్ నగర ఓటర్లు ఓటు వేయలేదనే కక్షతోనే నీటి సరఫరా చేయడం లేదు. తాగునీటి సమస్యపై అవసరమైతే జలమండలి ఎదుట ధర్నా చేస్తాం. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌పై కాకుండా వాటర్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, పార్టీ నాయకులు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment