ఇంకా శుద్ధి ఎందుకు, లక్షన్నర కోట్ల ఖర్చు ఎందుకు?:కేటీఆర్
నమామి గంగేకు కిలోమీటరుకు రూ.17 కోట్లు, మూసీకి 2,700 కోట్లా?
రేవంత్ ధన దాహం, కుంభకోణాలకు సామాన్యులు బలి అవుతున్నారు
పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం సీఎం పాలనా వైఫల్యానికి నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే.. ఇంకా శుద్ధి ఎందుకు, లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్, మంత్రులు తనపై చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేసిన ఓ మంత్రికి లీగల్ నోటీసులు పంపించానని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ వికారాలకు పాల్పడుతోందని అన్నారు.
సీఎంతో పాటు తనపై వ్యాఖ్యలు చేసిన మంత్రిని మానసిక ఆరోగ్య నిపుణుల వద్దకు లేదా మానసిక వైద్యుల వద్దకు పంపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఆయన కోరారు. రాష్ట్రంలోని అనేక అంశాలకు సంబంధించి కేటీఆర్ గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో వరుస పోస్ట్‌లు చేశారు.
గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు కిలోమీటరుకు రూ.17 కోట్ల చొప్పున ఖర్చవుతుండగా, మూసీ సుందరీకరణకు మాత్రం కి.మీ.కు రూ.2,700 కోట్లు ప్రతిపాదించారన్నారు. ఇది సుందరీకరణ ప్రాజెక్టు కాదని, ప్రజాధనాన్ని లూటీ చేసే పథకమని విమర్శించారు.
గుండెలు ఆగుతున్నా కూల్చుడు ఆగడం లేదు
కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని, బ్యాంకు నుంచి అప్పు తెచ్చి మరీ కట్టుకున్న గూడును ప్రభుత్వం ఎప్పుడు కూల్చుతుందో అన్న భయంతో సామాన్యులు ప్రాణాలు వదులుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుండెలు ఆగిపోతున్నా, కుటుంబాలు చెల్లా చెదురవుతున్నా ప్రభుత్వం మాత్రం ఇళ్ల కూల్చివేతలపై తగ్గడం లేదన్నారు.
ఉమ్మడి కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి చిచ్చు పెట్టిన మూర్ఖుడు సీఎం రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. మూసీ వద్ద ఇళ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్ ఇల్లుతో పాటు రూ.25 వేల పారితోషికం.. అంటూ అధికారులు వెకిలి అఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కోటి ఆశలతో కట్టుకున్న కలల సౌధం ఖరీదు కేవలం రూ.25 వేలేనా అని ప్రశ్నించారు.
మీ సోదరుడు, మంత్రుల ఇళ్లకు రూ.50 వేలు ఇస్తే కూల్చమంటారా? అని వ్యాఖ్యానించారు. ఇండ్లు పోతాయనే భయంతో బుచ్చమ్మ, కుమార్ ప్రాణాలు పోయాయని, సీఎం ధన దాహం, కుంభకోణాలకు ఎంత మంది ప్రాణాలు పోవాలో చెప్పాలన్నారు. ఇల్లు కూలుస్తారనే భయంతో కుమార్ అనే వ్యక్తి మరణించడంతో ఇప్పటికే తల్లి కూడా లేని ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారన్నారు. వీటన్నిటికీ ప్రజలు కాంగ్రెస్‌కు మిత్తితో సహా గుణపాఠం చెప్తారన్నారు.
పాలనా వైఫల్యంతో ఆదాయానికి గండి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుభవ రాహిత్యం, పాలనా వైఫల్యంతో ప్రభుత్వ ఆదాయం పడిపోతోందని కేటీఆర్ విమర్శించారు. సంపద సృష్టించి పేదలకు పంచే తెలివి లేకపోవడంతోనే అనర్థం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ప్రభుత్వ ఆదాయం వేగంగా పడిపోతుంటే.. వచ్చే నాలుగేళ్లు రాష్ట్ర ప్రజలకు కష్టకాలమే అని పేర్కొన్నారు.
ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప, దిద్దుబాటు చర్యలు కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. మార్పు మార్పు.. అంటూ తెలంగాణ ప్రగతికి పాతరేసిన పాపం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చిలుక ప్రవీణ్‌పై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment