ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి నన్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది
కేసు పెడితే పెట్టుకో.. ఏ విచారణకైనా సిద్ధం
సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి నన్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కేసు పెడితే పెట్టుకో. రెండు నెలలు లోపల వేసి పైశాచిక ఆనందం పొందుతానంటే, జైలులో మంచిగా యోగా చేసి ట్రిమ్‌గా వస్తా. ఆ తర్వాత పాదయాత్ర చేస్తా. ఉడుత ఊపులకు బెదరం. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్‌ఎస్‌ను ఎలా ఖతం చేయాలని అనుకున్న మాట వాస్తవం. నా అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం ఆయన విచక్షణకు సంబంధించిన అంశం. ఏ విచారణకైనా సిద్ధం. దేనికైనా రెడీగా ఉన్నా. ప్రజల తరఫున పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
ప్రజల దృష్టిని మళ్లించే ఆటలతో ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతీయకు. గాసిప్ పక్కన పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యలు చేశారు. ‘ఫార్ములా ఈ రేస్‌లో ఏం జరిగిందనే విషయాన్ని నా బాధ్యతగా ప్రజలకు వివరించాలని అనుకుంటున్నా. హైదరాబాద్, తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం.
ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. నాకు ఏసీబీ నుంచి ఎలాంటి నోటీసు అందలేదు..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు జవాబిచ్చారు.
రూ.55 కోట్ల ఫైల్‌పై సంతకం నేనే చేశా...
‘ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఐఏ, హెచ్‌ఎండీఏ, స్పాన్సరర్ అయిన గ్రీన్ కో నడుమ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. తమకు లాభం రాలేదనే కారణంతో రెండో విడత రేస్ నుంచి గ్రీన్‌కో తప్పుకోవడంతో రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచేందుకు ప్రభుత్వం తరఫున రూ.55 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో అప్పటి హెచ్‌ఎండీఏ కార్యదర్శి అర్వింద్‌కుమార్ తప్పేమీ లేదు. ఫైల్‌పై నేనే సంతకం చేశా. రూ.55 కోట్లు చెల్లించమని నేనే చెప్పినందున నాదే బాధ్యత.
కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు అక్కర్లేదు
పురపాలక శాఖలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ నడుమ అంతర్గతంగా డబ్బు సర్దుబాటు చేసుకోవచ్చు. సర్వ స్వతంత్ర సంస్థ హెచ్‌ఎండీఏకు సీఎం చైర్మన్‌గా, పురపాలక శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. హెచ్‌ఎండీఏ నిర్ణయాలు దేనికీ కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు అవసరం లేదు. రేవంత్ సీఎం పదవి చేపట్టిన వెంటనే నా మీద ఉన్న కోపంతో ఫార్ములా ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో జాగ్వార్, నిస్సాన్ వంటి కంపెనీలు సిగ్గుచేటు అని ప్రకటించగా, ప్రపంచం ముందు హైదరాబాద్ పరువు పోయింది.
ఈ రేస్ రాకుండా రేవంత్ తీసుకున్న నిర్ణయంతో రూ.700 కోట్ల నష్టం వచ్చింది. హైదరాబాద్ ఇమేజీని దెబ్బతీసి నష్టం చేసినందుకు రేవంత్ పైనే కేసు పెట్టాలి. సీఎం రేవంత్ మొగోడైతే మేఘా కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి మీద కేసు పెట్టాలి. రూ.55 కోట్ల చుట్టూ రాజకీయం చేస్తున్న రేవంత్ రూ.లక్షల కోట్లు ఖర్చయ్యే ఒలింపిక్స్ నిర్వహిస్తారట..’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
మొబిలిటీ రాజధానిగా మార్చేందుకే..
‘హైదరాబాద్‌లో ‘ఎఫ్ వన్’కార్ల రేసును నిర్వహించేందుకు 2003లో ప్రయత్నించి ప్రత్యేకమైన ట్రాక్ కోసం గోపన్‌పల్లిలోని 400 ఎకరాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇందులోని 129 సర్వే నంబర్‌లో సీఎం రేవంత్‌కు చెందిన 31 ఎకరాల భూమి కూడా ఉంది. అయితే రైతుల అభ్యంతరాలతో భూ సేకరణపై హైకోర్టులో కేసు నడుస్తోంది. మేం కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచి ఎలక్ట్రిక్ వాహన రంగానికి నగరాన్ని ‘భారత్‌లో మొబిలిటీ రాజధాని’గా మార్చాలని అనుకున్నాం.
ప్రపంచంలోని గొప్ప నగరాల జాబితాలో హైదరాబాద్‌ను చేర్చాలనే తపనతో సియోల్, జోహెన్నస్‌బర్గ్ వంటి నగరాలతో పోటీ పడి హైదరాబాద్‌కు ‘ఫార్ములా ఈ’ని రప్పించాం. తొలి దశ రేసింగ్ తర్వాత రాష్ట్రానికి రూ.700 కోట్ల మేర లబ్ధి జరిగింది. ఫార్ములా ఈ రేస్, మొబిలిటీ ప్రోగ్రామ్‌తో రూ.2,500 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇతర సంస్థలు కూడా తెలంగాణ ఈవీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాయి..’అని కేటీఆర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment