
గురువారం అసెంబ్లీలో మాట్లాడుతున్న జగదీశ్‌రెడ్డి
శాసనసభలో దుమారం రేపిన జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు
స్పీకర్‌ను ఉద్దేశించి ‘ఈ సభ నీ సొంతం కాదు..’ అన్న బీఆర్‌ఎస్ సభ్యుడు
‘మీరు పెద్ద మనిషిగా మాత్రమే ఆడ కూర్చున్నరు’ అంటూ వ్యాఖ్య
మాజీ మంత్రి వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరం
జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యల్లో తప్పు ఏముందన్న బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు
గందరగోళం నడుమ సభ వాయిదా.. సుమారు 3 గంటలపాటు ప్రతిష్టంభన
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు డిప్యూటీ సీఎం, మంత్రుల డిమాండ్.. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి గురువారం శాసనసభలో స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఈ సభ నీ సొంతం కాదు..’ అని ఆయన అనడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, అరుపులతో సభ దద్దరిల్లింది. దళిత స్పీకర్‌ను అవమానించిన, ఏక వచనంతో సంబోధించిన జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్‌రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు.
అందరికీ సమాన హక్కులు: జగదీశ్‌రెడ్డి
ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న బీఆర్‌ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి.. స్పీకర్‌ను ఉద్దేశించి ‘ఈ సభ మనందరిది. మనందరికీ సమాన హక్కులున్నాయి. మనందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే ఆడ కూర్చున్నరు తప్ప ఈ సభ నీ సొంతం కాదు..’ అని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడిన ప్రతిపదం వెనక్కి తీసుకోవాల్సిందేనని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.
సభాపతిని దూషించినందుకు ఆయనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. దళిత స్పీకర్‌ను అవమానించిన జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని కాంగ్రెస్ దళిత సభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించారని తప్పుబట్టారు. మొత్తం దళిత జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌కి దళితుల పట్ల చిన్నచూపు అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ పేపర్లు పైకి విసిరేస్తే నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సుదీర్ఘ విరామం తర్వాత సభ ప్రారంభం కాగా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులతో పాటు అధికార పక్ష సభ్యులు మాట్లాడారు. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని కొందరు, బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యులు కోరినా స్పీకర్ వారికి అవకాశం ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ సెషన్ మగిసేవరకూ జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. ఆ తర్వాత కూడా అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సస్పెన్షన్‌పై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్ళారు. అయినా అవకాశం ఇవ్వకపోవడంతో మూకుమ్మడిగా సభ నుంచి నిష్క్రమించారు.
అసలేమైంది..?
ఉదయం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుండగా (ఈ సమయంలో 4 బర్రెల కథ చెప్పారు)..అధికార పక్షం (మధ్యలో) మాట్లాడకుండా ఉండాలంటే చర్చను పక్కదారి పట్టించవద్దని స్పీకర్ అన్నారు. దీంతో ‘నేను గవర్నర్ ప్రసంగంపై చర్చ నుంచి అక్షరం పక్కకు పోయినట్టు తేల్చండి.
ఈ సభలో ఉండమంటే ఉంటా..పొమ్మంటే పోతా..’ అంటూ జగదీశ్‌రెడ్డి ఆవేశంతో తన చేతిలో ఉన్న నోట్స్‌ను కుర్చీకేసి విసిరికొట్టారు. దీంతో స్పీకర్‌ని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలను జగదీశ్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ‘అసహనానికి గురికాకుండా సహనంతో మాట్లాడండి. సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు.
మంత్రిగా పదేళ్లు పని చేశారు. మీరీ విధంగా మాట్లాడడం, సభా సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు..’ అని జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి స్పీకర్ అన్నారు. ‘ఏ సభా సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడానో మీరు చెబితే ఆ తర్వాత నేను మాట్లాడుతా..’ జగదీశ్‌రెడ్డి అన్నారు. దీంతో ‘నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం’ అని స్పీకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జగదీశ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో వాతావరణం వేడెక్కింది.
జగదీశ్‌రెడ్డి అన్నదాంట్లో తప్పేం ఉంది?: హరీశ్‌రావు
బీఆర్‌ఎస్ సభ్యుడు, మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..‘సభ్యులందరికీ సమాన హక్కులుంటాయని, సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించింది కాదని, ప్రతిపక్ష సభ్యులకు కూడా సమాన హక్కులుంటాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇందులో తప్పేం ఉంది..’ అని ప్రశ్నించారు.
మీరు చేయలేనిది మేం చేశాం: శ్రీధర్‌బాబు
2014–15లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందో తాము సంవత్సర కాలంలో చేసి చూపెట్టామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ‘వాళ్లు వ్యంగ్యంగా నవ్వుతున్నారు. వారి విషయంలో ప్రజలు వ్యంగ్యంగా నవ్వారు కాబట్టే మేము ఇక్కడ (అధికారంలో) ఉన్నాం..’ అని వ్యాఖ్యానించారు. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి దేశమంతా పచ్చగా కనిపించినట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా జగదీశ్‌రెడ్డికి కనిపించడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
దళితుడిని సీఎం చేశారా?: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
దళితుడిని సీఎం చేయకపోతే నా మెడ మీద తల ఉండదని 10 వేల సార్లు అన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇచ్చావా? అని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. దళితుడు (భట్టి విక్రమార్క) ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకి అని నిరూపించుకున్నవు అని అన్నారు. బీసీ కులగణన చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొనలేదని, వారికి ప్రజలపై ప్రేమలేదని వ్యాఖ్యానించారు.
మమ్మల్ని రమ్మంటారా? వద్దా?: తలసాని
సభ సాంప్రదాయాలను అధికారపక్షం పాటించకపోతే ఎలా? అని బీఆర్‌ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. సభకు తమను రమ్మంటారా? వద్దంటారా? చెప్పాలని స్పీకర్‌ను ప్రశ్నించారు. అయితే జగదీశ్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆయన్ను సస్పెండ్ చేయాలని మంత్రులు, అధికారపక్ష సభ్యులందరూ ట్రెజరీ బెంచీల వద్ద నిలబడి నినాదాలతో హోరెత్తించడంతో సభ దద్దరిల్లింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య సభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సాయంత్రం 3.35కు సమావేశమైన తర్వాత జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ సభ్యులను అనుమతించారు.
జగదీశ్‌రెడ్డి చెప్పిన 4 బర్రెల కథ
‘ఓ తండా వద్ద తవి్వన బావివద్దకు వెళ్లి ప్రజలకు గవర్నర్ ప్రసంగం చదివి వినిపించిన. అది విన్న వెంకటరాములు, రాజయ్యలు వారి ఊళ్లో ఉండే వెంకటయ్య కథతో పోల్చారు..మా అమ్మగారి ఇంటికి పాలుపోసి తీరుతా..అని నేను అంటే నా భర్త కొట్టిండని వెంకటయ్య భార్య సర్పంచ్‌కి ఫిర్యాదు చేసింది. మీకు బర్రెలే లేవు..పాలు ఎక్కడివి అని సర్పంచ్ అడిగితే నాకు నాలుగు బర్లున్నాయి అని వెంకటయ్య అన్నడు.
పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, మా అత్తగారు ఒకటి ఇస్తే, నేను ఒకటి కొంటే.. నాలుగైతయి అన్నడు. గవర్నర్ ప్రసంగం కూడా ఇలానే ఉందని ఆ గ్రామస్తులు అన్నరు..’ అని జగదీశ్‌రెడ్డి చెప్పారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఆటో కారి్మకులకు రూ.12 వేలు, అక్కచెల్లెళ్లకు రూ.2500, రైతులకు బోనస్, తులం బంగారం, స్కూటీలు, 2లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని నిలదీయడంతో వివాదం ప్రారంభమైంది.
‘గవర్నర్ ప్రసంగాన్ని ఏఐ, చాట్ జీపీటీతో తయారు చేసినట్టు ఉంది. మనసు కవి ఆత్రేయ బతికి ఉంటే ..ప్రభుత్వాలు ఇంత మనస్సు లేకుండా పనిచేస్తాయా? అని చూసి ఆత్మహత్య చేసుకునేవారు. గవర్నర్‌తో 36 నిమిషాల్లోనే 360 అవాస్తవాలు మాట్లాడించారు.’ అని అంతకుముందు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment