సాక్షి, జనగామ: తెలంగాణలో అసెంబ్లీ వేళ అధికార బీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచే వారి జాబితాను సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు హైకమాండ్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరికొందరు ఇప్పటికే పార్టీని వీడుతూ హైకమాండ్ తీరుపై విరుచుకుపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
తాజాగా బీఆర్‌ఎస్ పార్టీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. మరోసారి సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య కేశవనగర్‌లో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే నేను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయి.
ఇదే సమయంలో స్థానిక నేతలపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో డప్పులు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారు. కోలాటమాడాలన్నా భయంతో వణికిపోతున్నారు. ఇలా ఎందుకు ఇంత అభద్రతాభావంతో ఉన్నారో అర్థం కావట్టేదు. వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ వరకు నేను ఎమ్మెల్యేగా ఉంటాను. అప్పటి వరకు స్టేషన్ ఘనపూర్‌కు నేను సుప్రీం’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉండగా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం టికెట్‌ను కడియం శ్రీహరికి హైకమాండ్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో, కడియం, రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో వీరితో మంత్రి కేటీఆర్.. ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని రాజయ్యకు కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో, మెత్తబడట్టే కనిపించిన రాజయ్య.. వెంటనే కడియంకే తన మద్దతు అని ప్రకటించారు. అనంతరం, వీలు చిక్కనప్పుడల్లా ఇలా కడియంను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment