సాక్షి, జగిత్యాల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అలాగే, తనపై విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని కౌంటరిచ్చారు. అలాగే, జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ చేరినట్టు వెల్లడించారు.
కాగా, సంజయ్ కుమార్ మంగళవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పుడు కనీసం ఒక్క కౌన్సిలర్‌గా కూడా లేని పరిస్థితిలో ఉన్నాను. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే మా బంధువులతో కట్టించాను. నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను.
కేటీఆర్ మాటలు నన్ను బాధించాయి. విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి. గతంలో వేరే పార్టీలో గెలిచినవారిని మీరెలా(బీఆర్‌ఎస్) చేర్చుకోన్నారో ముందు సమాధానం చెప్పాలి. జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం. నేను ఒక డాక్టర్‌ను చాలా కుటుంబాలను పోషించేంత ఆర్థికంగా ఉన్నవాడిని. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్‌లో చేరాను. మా కుటుంబం అంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమని భావించాను. రైతుల కోసం రుణమాఫీ చేయడానికి ప్రక్రియ ప్రారంభించారు సీఎం రేవంత్. తెలంగాణాలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్స్ కట్టించాం. దీనికి సంబంధించిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. సంజయ్ కుమార్ ఇటీవలే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ బీ-ఫామ్‌తో ఎన్నికల్లో గెలిచిన సంజయ్.. పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే సంజయ్‌పై కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో బీఆర్‌ఎస్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment