
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్‌లో ఈ నెల 27న నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యలోనే పార్టీ ప్రతినిధులను ఈ వేడుకకు ఆహ్వానించనుంది. బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే పార్టీ జనరల్ బాడీ సమావేశంలో 300 మంది (మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, జెడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాల అధ్యక్షులు) నేతలు పాల్గననున్నారు.
గతంలో జరిగిన జనరల్ బాడీ సమావేశానికి పార్టీ ప్రతినిధులను మౌఖికంగా ఆహ్వానించగా ఆవిర్భావ దినోత్సవానికి మాత్రం వ్యక్తిగతంగా అటు పార్టీ, ఇటు శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ నుంచి ఆహ్వానపత్రాలు పంపుతున్నారు. ఎల్బీ స్టేడియంలో సుమారు 6 వేల మంది ప్రతినిధులతో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని తొలుత భావించినా వరికోతలు ముమ్మరంగా సాగుతుండటం, వేసవి తీవ్రత పెరగడంతో పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రస్తుత పరిణామాలపై ఐదు తీర్మానాలు...
బీఆర్‌ఎస్‌గా మారాక జరుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఏప్రిల్ 27న తెలంగాణ భవన్‌లో జరిగే జనరల్ బాడీ సమావేశంలో ఐదు రాజకీయ తీర్మానాలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీఆర్‌ఎస్ వైఖరిని వెల్లడించేందుకు వీలుగా ఐదు రాజకీయ తీర్మానాలు రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం.
జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పాత్ర, భావసారూప్య పార్టీలతో కలసి పనిచేయడం, కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలను ఎండగట్టడం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర రాజకీయా ల్లో బీఆర్‌ఎస్ పాత్ర తదితర అంశాలు ఈ రాజకీయ తీర్మానాల్లో ఉండనున్నాయి. పార్టీ ఆత్మీయ సమ్మేళనాల తీరుతెన్నులపై ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలోని కమిటీ ఎప్పటికప్పుడు పార్టీ అధినేతకు నివేదికలు అందిస్తోంది. ఆవిర్భావ దినోత్సవంలో ఆతీ్మయ సమ్మేళనాల తీరుతెన్నులను విశ్లేషిం చడంతోపాటు యువజన, విద్యార్థి సమ్మేళనాల నిర్వహణపై దిశానిర్దేశం చేసే అవకాశముంది.
అక్టోబర్ 10న వరంగల్‌లో పార్టీ మహాసభ
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేడర్‌తోపాటు యువజన, విద్యారి్థ, వివిధ సామాజిక వర్గాలతో భేటీకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 10న వరంగల్‌లో పార్టీ మహాసభను నిర్వహించడంతోపాటు ఆ తర్వాత వరుసగా బహిరంగ సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు రాబోయే పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి 27న జరిగే ఆవిర్భావ సభలో దిశానిర్దేశం చేసే అవకాశముంది.