సాక్షి, హైదరాబాద్: త్వరలో నల్లగొండలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది. దాదాపు రెండులక్షల మందితో సభ ఏర్పాటు చేసి, కేఆర్‌ఎంబీ వాస్తవాలను ప్రజలకు వివరించనుంది. సభావేదిక నుంచే పార్టీ అధినేత కేసీఆర్ శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ వైఫల్యాలను వివరించి..ఇంటింటికీ పార్టీ శ్రేణులు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నల్లగొండ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించాలని అనుకుంటోంది.
2018 ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నా, 2023లో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట మినహా అన్నిచోట్ల బీఆర్‌ఎస్ ఓటమిని చవిచూసింది. దీంతో తిరిగి కేడర్‌లో పునరుత్తేజం నింపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జరిగే అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో కృష్ణాజలాలపై సాగించిన పోరాటాన్ని సభావేదికగా ప్రజలకు వివరించాలని పార్టీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇప్పటివరకు కేఆర్‌ఎంబీతో ఎన్నిసార్లు సమావేశమైంది, సమావేశంలో చర్చించిన అంశాలను సభావేదిక నుంచే శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. విభజన చట్టంలోని అంశాలతోపాటు ముఖ్యంగా నీటి వాటాలపై బీఆర్‌ఎస్ కొట్లాడిన తీరును ప్రజలకు వివరించి వారిని, చైతన్యపర్చాలని చూస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టాన్ని ప్రముఖంగా వివరించనుంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2లక్షల రుణమాఫీ, వరికి 500రూపాయల బోనస్ హామీలను ఎండగట్టనున్నట్టు తెలిసింది.
సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల చేయకపోవడం, చివరి ఆయకట్టు రైతులు వేసిన పంట పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వంటి అంశాలతోపాటు గత బీఆర్‌ఎస్ సాగునీటి విడుదలకు తీసుకున్న చర్యలు, రైతుల కోసం పాటుపడిన తీరును కేసీఆర్ వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాతే నల్లగొండ సభ జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment