సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై శనివారం బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సంజయ్ దిష్టి బొమ్మల దహనం, ధర్నాలతో నిరసన వ్యక్తం చేశాయి.
హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, సంగారెడ్డి, బంజారాహిల్స్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టాయి. బండి సంజయ్‌కు మహిళలను గౌరవించే సంస్కారం లేదని, ఆయన తీరు మార్చుకోలేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి.
రాజ్‌భవన్ వద్ద ఆందోళన
సంజయ్ వ్యాఖ్యల విషయంగా గవర్నర్ తమిళిసైను కలసి ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వ విప్ సునీత, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో గేటు వద్దే ధర్నాకు దిగారు. బారికేడ్లు నెట్టుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో బీజేపీకి, మోదీకి, సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌భవన్ ఎదుట రాస్తారోకో చేశారు. దీనితో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
చివరికి మహిళా నేతలు రాజ్‌భవన్ ప్రహరీకి, బారికేడ్లకు వినతిపత్రాలు అంటించి నిరసన తెలిపారు. ఎవరికి ఏ ఇబ్బందులున్నా రాజ్‌భవన్ గేట్లు తెరిచే ఉంటాయని గవర్నర్ గతంలో చెప్పారని.. ఓ మహిళగా తమ బాధ అర్థం చేసుకుంటారని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. ఇద్దరు, ముగ్గురిని లోనికి అనుమతించినా బాగుండేదని, కనీసం గవర్నర్ ఓఎస్డీ వచ్చి వినతిపత్రం తీసుకుని ఉండాల్సిందని పేర్కొన్నారు. గవర్నర్ ఇప్పటికైనా స్పందించి సంజయ్‌తో క్షమాపణ చెప్పించాలనర్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయి కిరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సూర్యాపేటలో బీఆర్‌ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ దిష్టి»ొమ్మను దహనం చేశారు. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
కాజీపేట, సుబేదారి పోలీస్‌స్టేషన్లలో సంజయ్‌పై ఫిర్యాదులు చేశారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మంచిర్యాల, నర్సాపూర్, బెల్లంపల్లి, దేవరకొండ, నారాయణపేటలలో ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, మదన్‌రెడ్డి, చిన్నయ్య, రవీంద్రకుమార్, రాజేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
వ్యక్తిగతంగా హాజరు కావాలి!
సంజయ్‌కి మహిళా కమిషన్ నోటీసులు
బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ అంశాన్ని సూమోటోగా తీసుకుని.. బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆయనను ఆదేశించనున్నట్టు తెలిపారు. సంజయ్ వ్యాఖ్యలపై విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు.
సంజయ్‌పై కేసు నమోదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ 354ఏ, 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇదే అంశంపై బీఆర్‌ఎస్ నాయకుడు చెట్లపల్లి రాంచందర్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్, పలువురు మహిళా నేతలు, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment