రేవంత్‌పై బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల ధ్వజం
గతంలో మహిళా సభ్యులు అడిగితే సీఎంలు స్పందించేవారు
ప్రస్తుతం సీఎం మైక్ ఇచ్చేందుకు భయపడుతున్నారు
టీడీపీ రేవంత్ సీఎం పదవి లాక్కున్నా భట్టికి బాధ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభలో సీఎం స్థానంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులను చూశాం. మహిళా శాసనసభ్యులు నిలబడి మైక్ అడిగితే గతంలో సీఎంలు స్పందించేవారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు మైక్ ఇచ్చేందుకు భయపడుతున్నారు. మహిళా ఎమ్మెల్యేలు నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిల్చుని మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడిగినా ఇవ్వకుండా సీఎం సహా, అధికార పక్షం రాక్షసానందం పొందుతోంది.
స్పీకర్ మనసు మారుతుందేమోనని గంటల కొద్దీ నిల్చున్నాం. మహిళా ఎమ్మెల్యేలను కించ పరిచినా సభ స్పందించలేదు. సీఎం కుర్చీ విలువను రేవంత్ తగ్గించారు..’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
అక్కలు అంటూనే పంగనామాలు
‘ఆడబిడ్డలను అవమానించడం సీఎంకు నిత్యకృత్యంగా మారింది. రేవంత్‌ను నమ్ముకున్న రాహుల్‌గాంధీ బతుకుని సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా? సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరును రేవంత్ ప్రస్తావించడం సరికాదు. నేను రేవంత్‌ను నడిబజారులో నిలబెట్టలేదు, రాజ్‌భవన్‌లో కూర్చోబెట్టాను. గతంలో నన్ను చేవెళ్ల చెల్లెమ్మ అని పిలిచింది కాంగ్రెస్ కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. ఈ సీఎం మాత్రం అక్కలు అంటూనే పంగనామాలు పెడుతున్నారు.
గతంలో పీసీసీ అధ్యక్షులు కూడా పార్టీలు మారారు. సీఎం రేవంత్ సహా అసెంబ్లీలో ఇప్పుడున్న వారిలో ఎంత మంది పార్టీలు మారలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మమ్మల్ని టార్గెట్ చేయడం ఎందుకు? టీడీపీ రేవంత్ సీఎం పదవి లాక్కున్నా భట్టికి బాధ లేదు. మాకు సీఎం క్షమాపణ చెప్పడం ముఖ్యం కాదు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం నుంచి సమాధానం కోసం శుక్రవారం సభలో పట్టుబడతాం. మాకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. శాసనసభలో మహిళల గౌరవాన్ని కాపాడాలి..’ అని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
మాపై వ్యాఖ్యలు బాధాకరం: సునీత
‘నాలుగున్నర గంటలు సభలో నిల్చున్నా పాలకపక్షం స్పందించక పోగా హేళన చేసింది. జూనియర్ ఎమ్మెల్యేలు మాపై చేసిన వ్యాఖ్యలు బాధాకరం. గతంలో నా తరఫున నర్సాపూ ర్ ప్రచారానికి వచ్చిన రేవంత్ చేసిన వ్యాఖ్యల వల్లే నాపై మూడు కేసులు నమోదయ్యాయి. సమాచారం లేకుండా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు మేము వ్యతిరేకం అన్నట్లుగా కాంగ్రెస్ సభ్యులు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు..’ అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. సీఎం ఓ వైపు ఇందిర, సోనియా పేర్లు చెపుతూ మరోవైపు మహిళా ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారని కోవా లక్ష్మి విమర్శించారు. చట్ట సభల్లో్లనూ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు.
తాలిబన్ సంస్కృతికి వారసుడిలా సీఎం: మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి
సీఎం రేవంత్ ఫ్యూడల్ మనస్తత్వంతో తాలిబన్ సంస్కృతికి వారసుడిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సహచర ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, మర్రి జనార్దన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ ఎమ్మెల్యేలు సబిత, సునీతా లక్ష్మా రెడ్డిపై ఆయన వ్యాఖ్యలు జుగుప్సా కరమన్నారు.
పూటకో పార్టీ మారిన రేవంత్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో రేవంత్‌కు తగిన శాస్తి జరుగు తుందని హెచ్చరించారు. సబిత, సునీతపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం దుశ్శాసన పర్వాన్ని తలపిస్తోందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌పై ఉన్న కోపాన్ని భట్టి విక్రమార్క సబితపై చూపించారన్నారు. అసెంబ్లీలో గొంతు నొక్కితే ప్రజాక్షేత్రంలో మాట్లాడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment