
వెంపటిలో బోనం ఎత్తుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
తుంగతుర్తి, మద్దిరాల: అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు దొరల కబంధ హస్తాల్లో నలిగిపోతోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్టినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు వెలుగుపల్లి, అన్నారం, వెంపటి, రావులపల్లి, గొట్టిపర్తి, మద్దిరాల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని కుక్కడం, కుంటపల్లి, గోరెంట్ల, పోలుమల్ల గ్రామాల్లో చేపట్టిన రాజ్యాధికార యాత్రలో పాల్గొని ఆయన మాట్లాడారు.
మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు 50 ఎకరాలుంటే ఇప్పుడు 300 ఎకరాల భూమిని కూడ బెట్టుకొని అందులో రూ.40 కోట్ల బంగ్లా కట్టుకున్నారని ఆరోపించారు. ఇటీవల సీఎం కేసీఆర్ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకుండా యశోద ఆస్పత్రికి వెళ్లారని, అదే మనం ఆ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాలంటే భార్య మెడలో పుస్తెలతాడును తాకట్టు పెట్టాలి లేదా ఎకరం వ్యవసాయ భూమినైనా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా పూర్తి డబ్బులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో 33 లక్షలకు పైగా నిరుద్యోగులుంటే 8 ఏళ్ల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వేయకుండా రాత్రికిరాత్రే కేవలం 81 వేల ఉద్యోగాలను ప్రకటించారని ప్రవీణ్ విమర్శించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment