సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.41 వేల కోట్లకు లెక్కలు లేవంటూ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌తోపాటు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ స్పష్టం చేశారు. ఆడిట్ సంస్థ అడిగితే దానిని పట్టుకొని కనీస పరిజ్ఞానం లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆడిట్ సంస్థలు ప్రశ్నలు వేయడం సహజమని, వాటి ఆధారంగా ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు. బ్యాంకుల్లో ఒకరి ఖాతాకు బదులు మరొకరి ఖాతాలో రూ.410 జమ అయినా వెంటనే సరి చేస్తారని అలాంటిది రూ.41 వేల కోట్లకు లెక్కలు లేకుంటే వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. బుగ్గన మంగళవారం ఆర్ అండ్ బి భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
ట్రెజరీ ద్వారా బిల్లులు చెల్లించకపోవడంపై ఆడిట్ సంస్థ వివరణ కోరితే ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) ప్రోగ్రామ్‌లో లోపాల కారణంగానే ఇలా జరిగిందన్నారు. అంతే కానీ లెక్కలు లేకపోవడం, అవతకవకలకు ఆస్కారమే లేదన్నారు. తెలంగాణ వాటాపై ఏపీ అప్పులు తెస్తోందంటూ ఆరోపించడం అవివేకమన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంపై మనకు అప్పు ఎలా ఇస్తారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పును రెండు రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓ పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది’ అని బుగ్గన పేర్కొన్నారు. అప్పుల్లో కోత పేరుతో కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) వస్తున్న వార్తలు, టీడీపీ నేతల ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
రెండేళ్లలో పేదలకు లక్ష కోట్ల సాయం..
కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి అప్పులు చేశామని, రెండేళ్లలో నవరత్నాల పథకాల ద్వారా లక్ష కోట్ల రూపాయలు పేదలకు సాయంగా అందించామని బుగ్గన వివరించారు. అప్పులు కూడా విచక్షణతోనే చేశామన్నారు. తాము రైతులు, విద్యార్ధులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం అప్పులు చేశామని, చంద్రబాబు హయాంలో ఆర్భాటాలు, సదస్సులు, ఎంవోయూల కోసం అప్పులు చేశారని గుర్తు చేశారు. క్యాన్సర్ ఫౌండేషన్‌తో ఎంవోయూలు చేసుకుని లక్షన్నర ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెప్పారన్నారు. ఉద్యోగాలు వస్తాయా.. రోగులు వస్తారా? అని తాను అసెంబ్లీలో ప్రశ్నించానని బుగ్గన పేర్కొన్నారు.
దున్నపోతు ఈనిదంటే..
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న తరహాలో ఆడిట్ సంస్థ అడిగిన వివరణ ఆధారంగా పీఏసీ చైర్మన్ ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏవైనా అనుమానాలు, సందేహాలుంటే బాధ్యత గల పీఏసీ చైర్మన్‌గా సమావేశం నిర్వహించి అధికారులను అడిగి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.
ప్రైవేట్ వ్యక్తికి సీఎఫ్‌ఎంఎస్..
2018లో చంద్రబాబు హయాంలో ప్రైవేట్ సంస్థకు రూ.300 కోట్లను ధారపోసి తెచ్చిన సీఎఫ్‌ఎంఎస్ పోగ్రామ్‌లో లోపాలను సరి చేస్తున్నామని బుగ్గన తెలిపారు. ప్రభుత్వానికి వెన్నెముక లాంటి చెల్లింపులకు సంబంధించిన సీఎఫ్‌ఎంఎస్‌ను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తి చేతికి అప్పగించారన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారనడం అవాస్తవమన్నారు.
పరిమితికి మించిన అప్పులు బాబు హయాంలోనే
పీడీ ఖాతాల్లో ఉన్న రూ.10,895 కోట్లు మార్చి నెలాఖరు నాటికి వ్యయం కాకపోవడంతో ప్రభుత్వ కన్సాలిడేటెడ్ నిధికి జమ అయ్యాయన్నారు. ఇది సర్వసాధారణమన్నారు. టీడీపీ హయాంలో 2018–19లో రూ.19,530 కోట్లు, 2019–20లో 20,998 కోట్లు ఇలాగే జరిగాయని గుర్తు చేశారు. సీఎఫ్‌ఎంఎస్ పోగ్రామ్‌లో లోపాల వల్లే ట్రెజరీకి మ్యాచ్ కాలేదని మంత్రి పేర్కొన్నారు. అప్పుల్లో రూ.17 వేల కోట్లు తగ్గించినట్లు పేర్కొన్నారని, ఇందులో రూ.16,419 కోట్లు గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి చేసిన అప్పుల వల్లే తగ్గించారని బుగ్గన పేర్కొన్నారు.
సామాన్యులకు భరోసా కల్పించాం
కరోనా వల్ల రాబడి గణనీయంగా తగ్గినా సామాన్యులను ఆదుకుని భరోసా కల్పించామని, కోవిడ్ నిర్వహణలో ఏపీ మెరుగ్గా వ్యవహరించిందని పలు సంస్ధలు పేర్కొన్నాయని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబు మాదిరిగా వ్యవసాయం దండగని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాలని, యూజర్ చార్జీలు విధించాలని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదని, సబ్సిడీలు వద్దని ఈ ప్రభుత్వం చెప్పలేదన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కారు బకాయి పెట్టిన ధాన్యం, విత్తనాలు, విద్యుత్ సబ్సిడీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను ఈ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. కరోనా కష్టాల్లో ఆదాయం పడిపోవడంతో అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయని, అదే తరహాలో ప్రజలను ఆదుకోవడానికి అప్పులు చేస్తున్నామని, అదీ కూడా పరిమితికి లోబడే చేస్తున్నామని బుగ్గన పేర్కొన్నారు. జీతాల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment