అప్పులపై తప్పుదోవ | Buggana Rajendranath Comments On TDP | Sakshi
Sakshi News home page

అప్పులపై తప్పుదోవ

Published Mon, Jan 3 2022 3:55 AM | Last Updated on Mon, Jan 3 2022 3:55 AM

Buggana Rajendranath Comments On TDP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రం రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తుంటే ఓర్వలేని విపక్ష టీడీపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. సానుకూల వృద్ధి దిశగా ఏపీ పరుగులు తీస్తుంటే తట్టుకోలేక తిరోగమనం అంటూ దుష్ప్రచారానికి తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019–20లో వృద్ధి రేటు పెరిగిందని, కరోనా కష్టాలతో మధ్యలో తగ్గినా ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని బుగ్గన స్పష్టం చేశారు. కరోనాలోనూ తలసరి ఆదాయాలు పడిపోకుండా చూశామన్నారు. ఒకవైపు  రెవెన్యూ లోటు తగ్గుతోందని కాగ్‌ చెబుతున్నా టీడీపీ నేతలు అబద్ధాలు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంతో పోలిస్తే 2020–21లో రాష్ట్రంలో ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తక్కువేనని చెప్పారు. ప్రతీ అప్పు, ప్రతీ ఖర్చుకూ లెక్కలున్నాయని, ప్రత్యక్ష నగదు బదిలీలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉందని తెలిపారు. ఈ మేరకు మంత్రి బుగ్గన ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

అప్పులపై కోవిడ్‌ ప్రభావం
2020 నుంచి జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం, రాష్ట్ర ఆదాయం, అప్పులపై కోవిడ్‌ తీవ్ర ప్రభావం చూపినా ఇది ప్రభుత్వ లోపాల వల్ల మాత్రం కాదు. విభజన సవాళ్లతో పోరాడుతున్న సమయంలో కోవిడ్‌ మహమ్మారి వల్ల ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందనే వాస్తవాలను గుర్తుంచుకోవాలి. 
► గత సర్కారు హయాంలో అనుకూల పరిస్థితులున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటు 2017–18లో 10.09 శాతం, 2018–19లో 4.88 శాతానికి క్షీణించింది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో అత్యల్పం.

ప్రస్తుత ధరలతో తప్పుదోవ
యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఎన్నో ఏళ్లు పనిచేశారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆర్థిక వృద్ధిని లెక్కించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం సబబేనా? టీడీపీ నేతలు ప్రస్తుత ధరలతో జీఎస్‌డీపీని పోల్చి చూడటం వల్ల 2020–21కి సంబంధించి వాస్తవ జీఎస్‌డీపీ లెక్కలతో వారి వాదన సరిపోలడం లేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జీఎస్‌డీపీ వృద్ధి రేటు 2019–20లో 7.23 శాతం పెరిగింది. ఇది దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగో స్థానంలో నిలబెట్టింది. తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్‌డీపీ క్షీణతను 2020–21లో 2.58 శాతానికి పరిమితం చేసింది. తద్వారా మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, కర్నాటక, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌ లాంటి ఎన్నో రాష్ట్రాల కంటే మెరుగ్గా నిలిచింది.

తలసరి ఆదాయం
రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి రేటు గత ప్రభుత్వ హయాంలో 2017–18లో 14.6 శాతం ఉండగా 2018–19లో 10.11 శాతానికి క్షీణించింది. 2019–20లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.63 శాతం ఉంది. ఇది దేశంలో 3వ వేగవంతమైన వృద్ధి రేటు. తెలంగాణ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది. 2020–21లో కరోనా వల్ల జాతీయ స్థాయిలో తలసరి వృద్ధి రేటు మైనస్‌ 4 శాతం నమోదు కాగా ఏపీలో తలసరి క్షీణతను 1.03 శాతానికి ఆపగలిగాం. 

రాబడులు
గత ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే ఈదఫా తొలి ఆరు నెలల్లో రెవెన్యూ లోటు తగ్గిందని సెప్టెంబర్‌లో కాగ్‌ నివేదిక స్పష్టం చేసినా రెవెన్యూ లోటు ఆర్థిక లోటును అధిగమించిందని ప్రతిపక్ష నేతలు పచ్చి అవాస్తవాలు చెబుతున్నారు. రాష్ట్ర పన్నుల  రాబడులు 2021–22లో పెరుగుతున్నాయి. 2021 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 34 శాతం రాబడుల్లో వృద్ధి నమోదైంది. 

ద్రవ్య, రెవెన్యూ లోటు
విభజన సమస్యలకు తోడు గత సర్కారు నిర్వాకాలు, విచ్చలవిడి ఖర్చులతో రాష్ట్ర ద్రవ్య బాధ్యతలు అనవసరంగా పెరిగాయి. కోవిడ్‌ నివారణకు లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చింది. 2020–21లో కేంద్ర ద్రవ్య లోటు 9.5 శాతం, రెవెన్యూ లోటు. 7.5 శాతానికి పెరిగాయి. ఇదే ఏపీలో 2019–20లో ద్రవ్య లోటు 3.5 శాతం, రెవెన్యూ లోటు 2.6 శాతం మాత్రమే ఉంది. 2020–21లో ద్రవ్యలోటు 5.38 శాతం, రెవెన్యూ లోటు 3.46 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరగడానికి అసలు కారణాలను చెప్పకుండా ప్రభుత్వాన్ని నిందించడం విడ్డూరం.

అప్పులపై దుష్ప్రచారం
టీడీపీ సర్కారు బడ్జెటేతర అప్పులతో కలిపి రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. 2021 మార్చి 31 నాటికి ప్రజాపద్దు కింద తీసుకున్న రుణాలు రూ.3,55,874.3 కోట్లు. ఇందులో కోవిడ్‌ కారణంగా కేంద్రం అనుమతించిన జీఎస్‌డీపీలో అదనపు 2% రూ.20 వేల కోట్లున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగే కొద్దీ రుణ విలువ పరిమితి పెరుగుతుంది. విభజన సమయానికి ప్రజా రుణం రూ.1,30,654.34 కోట్లకు పెరగ్గా 2019 మార్చి 31 నాటికి రూ.2,57,509.87 కోట్లకు చేరింది. గత ప్రభుత్వం రూ.1,20,000 కోట్లు అప్పు చేసి నీరు–చెట్టు లాంటి పథకాలతో వృథాగా ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ప్రజా రుణం రూ.16,419 కోట్లు ఎక్కువగా తీసుకోవడంతో కేంద్రం 2021–22లో రుణ పరిమితిని తగ్గించింది. 

డీబీటీతో ప్రజలకు రూ.1,14,9670.93 కోట్లు 
కోవిడ్‌ సంక్షోభంలో సమాజంలోని అన్ని వర్గాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకునేందుకు గత రెండున్నరేళ్లలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.1,14,967.93 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. జూన్‌ 2019 నుంచి ఇప్పటి వరకు మొత్తం 6,82,02,159 ప్రత్యక్ష నగదు బదిలీలు జరిగాయి. కోవిడ్‌ సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్రం అనుమతించిన మేరకు డబ్బును అప్పుగా తీసుకున్నాం. ప్రతి రూపాయికీ లెక్కలు చూపిస్తాం. 

ఆ రుణాలు గుదిబండగా..
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ రంగం అప్పులు రూ.31,647.64 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకు, డిస్కమ్‌లు ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,817.69 కోట్ల నుంచి రూ.20,121.97 కోట్లకు ఎగబాకాయి. పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.20,000 కోట్లు, ఏపీఆర్‌డీసీ ద్వారా రూ.3,000 కోట్లు, ఏపీడబ్ల్యూఆఆర్‌డీసీ ద్వారా రూ.4,000 కోట్లు, సీఆర్‌డీఏకు రూ.5,014 కోట్లు, ఏపీటిడ్కోకు రూ.4,601.59 కోట్లు, రైతు సాధికార సంçస్థ్దకు రూ.2,000 కోట్లు, ఏపీఎస్‌ఆర్టీసీ రూ.1,356 కోట్లు, ఏపీడీడబ్ల్యూసీ రూ.980 కోట్లు, ఏపీఎస్‌ఎహెచ్‌సీ రూ.1,870 కోట్లు, ఇతర కార్పొరేషన్ల రుణాలు రూ.9,438.59 కోట్ల అప్పు చేశారు. 2–3 ఏళ్ల మారటోరియంతో ఇది తీసుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వంపై పెనుభారం పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement