కేరళలో ఇండియాకూటమి భాగస్వామ్య పక్షాలపై నోరు పారేసుకోవద్దు
సీపీఎం పొలిట్‌బ్యూరోసభ్యుడు బీవీ.రాఘవులు హితవు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు ఫైర్ అయ్యారు. ముందు ఇంటగెలిచి రచ్చ గెలవాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో ఆయన తెలుగులో అనువదించిన సీపీఎం ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సంద ర్భంగా రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ ‘కేరళలో కాంగ్రెస్, సీపీఎం ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నా.. బీజేపీ రాకుండా ఆపగలిగారు. ఈసారి అది జరుగుతుంది. బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టడమే కాదు అధికస్థానాలు గెలవాలని వ్యూహా లు రచిస్తున్నట్టు మీడియాలో వస్తుంది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రేవంత్‌రెడ్డి అక్కడకు వెళ్లి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీజేపీకి ఒక్కస్థానం రాకుండా ఆలోచిస్తే బాగుంటుంది. అది ప్రజలకు, దేశానికి, లౌకికవాదానికి మంచిది. అక్కడకు వెళ్లి ఇండియాకూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలపై నోరుపారేసుకోవడం కన్నా బీజేపీపై నోరుపారేసుకుంటే బాగుంటుంది. మా కర్తవ్యం అదే. దానికి కాంగ్రెస్ తోడుకావాలి. ఇంకా బాగా ఫలితాలు వస్తాయి. ఆ పని మేం ఒక్కరమే చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా రేవంత్‌రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలి’అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇండియాకూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదించడం లేదు: తమ్మినేని
ఇండియాకూటమిలోని భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోయే పని ప్రధానపార్టీగా ఉన్న కాంగ్రెస్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కానీ కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. కలిసొచ్చే పార్టీలతో సంప్రదించే పనిచేయడం లేదన్నారు. ఈసారి భువనగిరిలో సీపీఎం పోటీ చేస్తుందని వివ రించారు. తమ అభ్యర్థి ఎండీ జహంగీర్ బాల్యం నుంచి కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారని, ఆయనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.
నేడు జహంగీర్ నామినేషన్: ఎస్ వీరయ్య
సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పారు. అనంతరం ప్రదర్శన, బహిరంగసభ ఉంటుందని, ఈ కార్యక్రమంలో రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment