
ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడ్డాయి. అయితే.. ఈ ఫలితాల్లోనూ కమలం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
పంజాబ్ లోని జలంధర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ మరణంతో జలంధర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిపారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్దదెబ్బ పడినట్లయ్యింది.
ఇక ఒడిశాలోని జార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేడీ (బిజూ జనతాదళ్) విజయం సాధించింది. బీజేడీ అభ్యర్థి దీపాలీ దాస్ గెలిచారు. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని బిజూ జనతాదళ్ నిలబెట్టుకుంది.
ఇక, ఉత్తరప్రదేశ్‌లో సువార్, ఛన్బే అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించారు. రెండు చోట్లా అప్నాదళ్ (సోనేలాల్)నే విజయం వరించింది. అప్నాదళ్.. అక్కడ అధికార బీజేపీకి భాగస్వామిగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్ తనయుడు అబ్దుల్లా అజామ్ ఖాన్ కు కోర్టు 15 ఏళ్ల నాటి కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో సువార్ లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఛన్బే నియోజకవర్గంలో రింకీ కోలే గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment