ఎన్టీఆర్‌ జిల్లాను హర్షించకపోవడం దారుణం | C Ramachandraiah Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ జిల్లాను హర్షించకపోవడం దారుణం

Published Mon, Jan 31 2022 4:09 AM | Last Updated on Mon, Jan 31 2022 5:25 AM

C Ramachandraiah Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఆహ్వానించి హర్షించకపోగా.. దానిని తప్పుబడుతూ సొంత మీడియా, సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం సాగించడాన్ని ఖండిస్తున్నట్టు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్‌ అంటే చంద్రబాబుకు నరనరాన ఎనలేని ద్వేషం ఉందన్న విషయం దీని ద్వారా తేటతెల్లమవుతోందని తెలిపారు. ఎన్టీఆర్‌ను గద్దెదించిన సమయంలోనే పార్టీలో ఎన్టీఆర్‌ చిహ్నాలు, ఆయన పేరును శాశ్వతంగా తొలగించాలని చంద్రబాబు యత్నించారని తెలిపారు.

కానీ ఎన్టీఆర్‌ పట్ల గౌరవాభిమానాలున్న తమలాంటి వారు ఆ నాడు ఆ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకున్న విషయాలను ఆయన గుర్తు చేశారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రించక పోవడంపై ఆనాడు ఎన్టీఆర్‌ వీరాభిమాని నెల్లూరు రమేష్‌రెడ్డి బహిరంగంగా ప్రశ్నించడంతో.. అది మీడియాలో వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ అభిమానులు ఎదురుతిరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ ఫొటోను సభ్యత్వ పుస్తకాలపై చంద్రబాబు ముద్రించినట్టు తెలిపారు. ఆ తర్వాత రమేష్‌రెడ్డిని కక్షపూరితంగా చంద్రబాబు దూరం పెట్టేశారని, రాజకీయంగా అణగదొక్కేశారని పేర్కొన్నారు. 

ఎన్టీఆర్‌ పేరు మళ్లీ ప్రజల్లో ప్రచారంలోకి వస్తే.. ఆయన వారసులైన బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న డిమాండ్‌ పార్టీలో గట్టిగా వస్తుందని, అప్పుడు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నదే చంద్రబాబు భయమని తెలిపారు. అందుకే 2004–14 మధ్య ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశారని, అయితే 2014–18 వరకు నాలుగేళ్ల పాటు అప్పటి కేంద్ర కూటమిలో భాగస్వామిగా ఉన్నా.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని ఏనాడూ బాబు కోరలేదన్నారు.  

ఎన్టీఆర్‌ పేరు మీదున్న అన్న క్యాంటీన్లు తొలగించారని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నా.. నిజానికి ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని, కిలో రెండు రూపాయల బియ్యం వంటి పథకాలను తుంగలో తొక్కింది చంద్రబాబే అన్న విషయాన్ని  గుర్తు చేశారు. ప్రజలకు చరిత్ర తెలియదని, వారు చరిత్ర మర్చిపోతారని బాబు అనుకొంటారని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినందుకు ఆయన కుమార్తెలు, కుమారులు హర్షించారని, చంద్రబాబుకు మాత్రం అలాంటి పెద్ద మనసు, సంస్కారం లోపించాయని ధ్వజమెత్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement