సాక్షి, నల్లగొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి తీసుకోలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం కారణంగా సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, పర్యటను నిర్వహించదని సూచించారు. కాగా నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు పార్టీల నేతలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ఏవీ. రంగనాథ్ పేర్కొన్నారు.
చదవండి: రైతుల కోసం ఎందాకైనా వస్తా: బండి సంజయ్
బండి సంజయ్ ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించే క్రమంలో టీఆర్ఎస్ నేతలు ఆయన పర్యటనను అడ్డుకునే క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జీ చేయడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం నుంచి కానీ, పోలీస్ శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని, చివరి నిమిషంలో బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు.
చదవండి: కొనుడుపై కొట్లాట..! టీఆర్‌ఎస్, బీజేపీ పరస్పర దాడులు
నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకేపి కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుందని, ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కాన్వాయిపై సైతం రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
పోలీస్ సిబ్బందికీ గాయాలు
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ షబ్ డివిజన్ పరిధిలో బండి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో జరిగిన ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి సైతం గాయాలు అయ్యాయని ఎస్పీ తెలిపారు.
రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి
రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటనలు, సమావేశాలు నిర్వహించవద్దని ఆయన సూచించారు. అనుమతులు లేకుండా చేసే పర్యటనల క్రమంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయితే అప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని, ముందుగా అనుమతి తీసుకోవడం ద్వారా కార్యక్రమానికి అనుగుణంగా తాము అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. మరో పక్క ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న క్రమంలో అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించవద్దని, శాంతి భద్రతల సమస్యలు రాకుండా తమతో సహకరించాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment