ఇక్కడ గ్యారంటీలు అమలు చేయకుండా.. మహారాష్ట్రలో అబద్ధపు ప్రచారాలు: కిషన్‌రెడ్డి
అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
రైతు భరోసా లేదు.. పింఛన్ల పెంపు లేదు.. బోనస్ ఇవ్వట్లేదు
రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపేంతగా ప్రభుత్వం దిగజారిందని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్యారంటీలు, హామీలను అమలు చేయకుండా.. మహారాష్ట్రలో అబద్ధపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఏ మొహం పెట్టుకుని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ పాలన మాటలు ప్రజలకు.. మూటలు కాంగ్రెస్ పారీ్టకి అన్నట్టుగా తయారైంది.
తెలంగాణలో సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ యాత్రలు చేసి.. ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ పాలన నడుస్తోంది. రేవంత్ వ్యవహారం, దోపిడీ, అబద్ధాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, తెలంగాణ సమాజాన్ని అవమానించే మాటలు.. అచ్చం కేసీఆర్ మాదిరిగానే సాగుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల డీఎన్‌ఏ ఒకటే. ఒకరిపై మరొకరు డూప్ ఫైటింగ్ చేయడం వారికి అలవాటే.
రాష్ట్ర ప్రభుత్వం విఫలం
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. వ్యాపార రంగం విశ్వాసం కోల్పోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికీ పైసల్లేవు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచలేదు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు.. కానీ కొత్త ఉద్యోగాలు ఇచ్చామంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు భారాన్ని కేంద్రమే భరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లలో విఫలమైంది. రైతులకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచి్చంది. కానీ 15 పైసలు కూడా ఇవ్వలేదు. రైతులకు ధాన్యంపై బోనస్ లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో ఫార్మా విలేజీకి భూసేకరణ విషయంలో కలెక్టర్‌పై దాడి, రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించేంతగా రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది.
రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నాం..
మూసీని కొబ్బరినీళ్లలా మారుస్తామన్న కేసీఆర్.. ఏమీ చేయకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి.. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చడం, నల్లగొండలో రైతులను రెచ్చగొట్టడం తప్పితే చేసిందేమీ లేదు. పేదల ఇండ్లు కూల్చొద్దంటే.. బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ అహంకారంతో మాట్లాడుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి.. పేదల ఇళ్లు కూల్చకండి.. ఇదే మా డిమాండ్. మూసీ పరిసర ప్రాంతంలో ఒక్క రోజు నిద్రపోండి అని సీఎం విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. శనివారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిద్ర చేయబోతున్నాం. ప్రజలతో కలసి వారి ఇంట్లోనే భోజనం చేసి, అక్కడే నిద్ర చేస్తాం.
పోలీసు వ్యవస్థ నిర్విర్యం
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. పోలీసు వ్యవస్థను నిర్విర్యం చేసింది. మజ్లిస్ పార్టీ, అసదుద్దీన్, రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయి.’’అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment