కుప్పం పర్యటనలో చంద్రబాబునాయుడు
సాక్షి, తిరుపతి: ‘‘కార్యకర్తలకు మీరేం చేశారు? సీనియర్లు అని చెప్పుకునే వారు మాకొద్దు.. ఎన్నికల్లో ఎవరు పట్టించుకోలేదు..!’’ గురువారం కుప్పం పర్యటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుట ఆ పార్టీ కార్యకర్తల నిర్వేదం ఇదీ. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబు గుడుపల్లె, కుప్పంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తల వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైనా ఆయన తేరుకుని ‘‘పొరపాటు జరిగింది.. మీరు ఎన్నో త్యాగాలు చేశారు.. మీకోసం ఆలోచించి ఉంటే బాగుండేది.. మిమ్మల్ని విస్మరించా. ఇకపై మీ కోసం 25% సమయం కేటాయిస్తా.. మీరంతా చెప్పినట్లు వింటా..’’ అంటూ బుజ్జగించారు.
తాను రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు పనిచేశానని, అయితే కార్యకర్తల కోసం సమయం కేటాయించలేకపోయానని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా చేశారని, నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చోటా మోటా నాయకులు ఎగిరి పడుతున్నారని, చిన్న కాలువను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తాను పులివెందులకు నీళ్లిస్తే అక్కడ ప్రజలు తనకు ఓటు వేశారన్నారు. ఈ ప్రభుత్వం కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు.
నాకు సీఎం పదవి అవసరమా?
చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు అడ్డు తగిలి స్థానిక నేతల తీరుపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. గతాన్ని తవ్వుకుంటే ముందుకు వెళ్లలేమని, అంతర్గత విమర్శలతో బలహీనపడతామని చంద్రబాబు వారిని సముదాయించారు. కొత్త రక్తాన్ని, పోరాడే వారిని ముందుకు తెద్దామన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన తనను అవమానాల పాలుచేసి చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా..? అంటూ ప్రశ్నించారు.
కార్యకర్త ఆత్మహత్యాయత్నం
చంద్రబాబు బెంగళూరు నుంచి గుడుపల్లెకు వస్తున్న మార్గంలో కొడతనపల్లి వద్ద కాన్వాయ్‌ను ఆపి స్థానికులతో మాట్లాడారు. ఆ సమయంలో శివ అనే కార్యకర్త చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్థానిక నాయకులు అడ్డుకోవడంతో జేబులోని పెట్రోల్ ప్యాకెట్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
బస్టాండ్ వద్ద బాబు బూతు పురాణం
కుప్పం పర్యటన సందర్భంగా గురువారం రాత్రి బస్టాండ్ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు సభ్యత మరచి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగంపై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగారు. అసభ్యంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
నేనొస్తే తప్పుడు కేసులు పెట్టి శిక్షిస్తా
‘‘నా దగ్గర నంగినంగిగా పని చేసిన కలెక్టర్లు, ఎస్పీలను ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వారి ప్రవర్తన నాకు ఒక గుణపాఠం. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎవరినీ వదిలిపెట్టను... నేను వస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టి శిక్షిస్తా. మీపై ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దు. నేను వచ్చాక ఒక్క సంతకంతో అన్ని కేసులు మాఫీ చేస్తా’’ అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment