విశాఖలోని చావులమదుం వద్ద జనాలు లేక వెలవెలబోయిన చంద్రబాబు రోడ్‌షో
సాక్షి, విశాఖపట్నం: ‘ఆటవిక రాజ్యంలో రౌడీలు, గూండాలు దాడి చేస్తే మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు.. అందుకే ఇప్పుడు బరి తెగించాలి.. గట్టిగా కొట్టాలి.. విశాఖకు పట్టిన శని వదిలించుకోవాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా విశాఖ నగరంలో రెండో రోజు శనివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. గాజువాక, విశాఖ దక్షిణం, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ‘మీలో రోషం రాకపోతే.. వచ్చే ఎన్నికల్లో రూ.1000, రూ.2000కు రాజీ పడిపోతే.. జీవితాల్లో శాశ్వతంగా నరకమే ఉంటుంది. కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలి’ అన్నారు. గాజువాక, పూర్ణా మార్కెట్, జగదాంబ జంక్షన్, సీతమ్మధార ప్రాంతాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. మీకు మంచి చేయలేకపోయానని బాధ పడుతున్నానని చెప్పారు. మంచి చేసిన నేను మంచి పేరు తెచ్చుకోలేకపోయాననే బాధ కూడా ఉందన్నారు.
తన 14 ఏళ్ల సీఎం రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరన్నారు. మరో హైదరాబాద్‌గా విశాఖను తయారు చేయాలని భావించి.. అందుకోసం ప్రణాళిక తయారు చేస్తే.. ఇప్పుడు దాన్ని గందరగోళంగా తయారు చేశారని విమర్శించారు. అమరావతి రాజధానిగా ఉంచుతూ.. విశాఖని ఫైనాన్షియల్ హబ్‌గా, నంబర్ వన్ సిటీగా తయారు చేయాలని అనుకున్నానని తెలిపారు. జగన్ పాలనలో బూతుల మంత్రి, హవాలా మంత్రి, కొబ్బరికాయల మంత్రితో పాటు అనేక రకాల మంత్రులున్నారని ఎద్దేవా చేశారు. మీ బట్టలు విప్పించే రోజులు తొందర్లోనే వస్తాయని హెచ్చరించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని జగన్‌కు చెబితే ఇంత వరకూ స్పందించలేదన్నారు. అమ్మ ఒడి, నాన్న బుడ్డీ అని మాట్లాడుతున్నారే తప్ప.. అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. కాగా, చంద్రబాబుకు రెండో రోజు కూడా విశాఖ ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తూర్పు నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహిస్తున్న చంద్రబాబుకు ఏయూ విద్యార్థి జేఏసీ నుంచి నిరసన ఎదురైంది. విశాఖని రాజధానిగా చేసేందుకు అంగీకరించని చంద్రబాబుకు నగరంలో తిరిగే అర్హత లేదంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, చంద్రబాబు రోడ్‌షో ముందుకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రచారానికి జనం కరువవ్వడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
స్వామీజీలు ఇలాంటి పనులు చేస్తారా?
‘రామతీర్థంలో రాముడి తల తీస్తే ఇక్కడి దొంగ స్వామి వెళ్లలేదు. స్వామీజీలు ఎవరైనా ముద్దులు పెడతారా? స్వాములు నిష్టగా, పవిత్రంగా ఉండి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదిస్తారే తప్ప, ఇలాంటి పనులు చేయరు. హిందూ మతానికి చెడ్డపేరు తెచ్చారు’ అని శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామీజీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతంపేటలో జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ.. స్వామీజీలు ఎవరినీ తాకరని, ఈ స్వామి మాత్రం సీఎంకు ముద్దులు పెట్టేస్తారన్నారు. బలవంతపు ఏకగ్రీవాల మాదిరిగా.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఐదేళ్లలో తాము రూ.1.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. జగన్ 22 నెలల్లో రూ.1.60 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment