సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో బీసీలకు పదవులు ఇచ్చే విషయంలో చంద్రబాబు మార్కు రాజకీయం మరోసారి బయటపడింది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో కీలకమైన పదవులను తన వర్గం వారికి కట్టబెట్టి విలువలేని పదవులు తమకు అంటగట్టారని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నేతలు వాపోతున్నారు. బీసీలకు 41 శాతం, ఎస్సీలకు 11 శాతం, మైనార్టీలకు 6 శాతం, ఎస్టీలకు 3 శాతం పదవులు మొత్తం 61 శాతం ఇచ్చామని చంద్రబాబు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర కమిటీలో కీలకంగా చెప్పుకునే ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నాలెడ్జి కమిటీ, కోశాధికారి పదవుల్లో ఎక్కువభాగం అగ్రవర్ణాలకే కట్టబెట్టారని ఆ పార్టీ బీసీ నేతలు విమర్శిస్తున్నారు.
ముఖ్యమైన ఈ 55 పదవుల్లో 55 శాతం (30) ఓసీలకు ఇవ్వగా, 24 శాతం (13) బీసీలు, 16 శాతం (9) ఎస్సీలకు, ఐదు శాతం (3) మైనార్టీలకు ఇచ్చినట్లు పార్టీ నేతలు లెక్కలు వేసి చెబుతున్నారు. పత్తిపాటి పుల్లారావు, వైవీబీ రాజేంద్రప్రసాద్, హనుమంతరాయ చౌదరి, దామచర్ల జనార్దన్ వంటి వారికి ఉపాధ్యక్ష పదవులు, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమా, గన్ని కృష్ణ వంటి వారికి ప్రధాన కార్యదర్శి పదవులు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, మద్దిపట్ల సూర్య ప్రకాష్ వంటి నేతలకు అధికార ప్రతినిధి పదవులు కట్టబెట్టారు. వీటిని బట్టి తన సామాజికవర్గం వారికి బాబు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్కరకురాని పదవులు సృష్టించి..
పనికిరాని పదవులుగా భావించే రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, కార్యదర్శి పదవులను ఎక్కువగా బీసీలు, ఎస్సీలకు ఇచ్చారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. గుర్తింపు లేని పదవులే కావడంతో వాటి సంఖ్య కూడా భారీగా పెంచేశారు. ఏకంగా 59 ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 108 కార్యదర్శి పదవులు సృష్టించి వాటిని బీసీలు, ఎస్సీలకు ఇచ్చారు. వాటిని చూపించి బీసీలకు పెద్దపీట వేశామని, ఎస్సీలను అందలం ఎక్కించామని, మైనారిటీలను నెత్తిన పెట్టుకున్నామని ప్రచారం మొదలుపెట్టారని ఆ పార్టీ నేతల్లోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అలంకారం కోసం ఎందుకూ పనికిరాని పదవుల్ని సృష్టించి వాటిని ఈ వర్గాలకు కట్టబెట్టారని పలువురు పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవులతో పార్టీలో కనీస విలువ కూడా ఉండదని అవి వచ్చిన నేతలు చెబుతున్నారు. తమను అవమానించేలా పనికిమాలిన పదవులను ఇచ్చారని, కీలకమైన పదవుల్ని మాత్రం కావాల్సిన వారికి ఇచ్చుకున్నారని మండిపడుతున్నారు. ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధి వంటి కీలకమైన పదవుల్లో ఒక్క గిరిజనుడికి అవకాశం ఇవ్వలేదని, దీన్నిబట్టే ఆ వర్గం పట్ల బాబుకు ఉన్న చిన్నచూపు అర్థమవుతోందని విమర్శిస్తున్నారు.
బాబు మార్కు రాజకీయం.. బీసీలకు విలువలేని పదవులు
Published Sun, Nov 8 2020 4:14 AM | Last Updated on Sun, Nov 8 2020 9:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment