
సాక్షి ప్రతినిధి ఒంగోలు: ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో 1998లో అప్పటి ప్రధాని వాజ్‌పేయికి సలహా ఇచ్చి, దేశ వ్యాప్తంగా మంచి రోడ్లు వేయించింది తానేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. డబ్బులు లేకుండా రోడ్లు ఎలా వేయాలని వాజ్‌పేయి అడిగితే తానిచ్చిన సలహా వల్లే దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ పెద్ద రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారన్నారు.
మార్కాపురంలో గురువారం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం మహిళలతో ఆత్మీయ సమావేశం, అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అనేక సంస్కరణలకు నాంది పలికింది తానేనన్నారు. హైటెక్ సిటీ, విమానాశ్రయం, జీనోమ్ వ్యాలీ ఇలా అన్నీ తన ఘనతేనని చెప్పారు. జీనోమ్ వ్యాలీ ఏర్పాటు వల్లే ఇప్పుడు అక్కడ కరోనా వ్యాక్సిన్ తయారైందన్నారు. సెల్‌ఫోన్లూ తన ఘనతేనని చెప్పుకొచ్చారు.