తమాషాలు చేస్తారా? | Chandrababu Naidu Comments On Ruling Party Leaders | Sakshi
Sakshi News home page

తమాషాలు చేస్తారా?

Published Thu, Dec 3 2020 4:29 AM | Last Updated on Thu, Dec 3 2020 4:29 AM

Chandrababu Naidu Comments On Ruling Party Leaders - Sakshi

తాపీ సామాగ్రి, బంగారం కొలిచే త్రాసుతో నిరసన తెలుపుతున్న చంద్రబాబు తదితరులు

సాక్షి, అమరావతి: ‘మీకేమీ తెలియదు. స్వార్థంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. చేతకాకపోతే నేర్చుకోండి. తమాషాలు చేస్తారా? మేం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. లేకపోతే మీరే పూర్తిచేసుకోండి.. మేం మాట్లాడం.. తేల్చుకుందాం రండి..’ అంటూ బుధవారం శాసనసభలో అధికారపక్ష సభ్యులు, మంత్రులపై ప్రతిపక్షనేత చంద్రబాబు రెచ్చిపోయారు. తీవ్ర నిరాశా నిస్పృహలతో సహనం కోల్పోయి స్థాయిమరిచి వ్యవహరించారు. తన హావభావాల ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పోలవరంపై చర్చ సందర్భంగా గతంలో టీడీపీ సర్కారు చేసిన తప్పిదంవల్లే పోలవరం విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, ఆ తప్పుల్ని తాము ప్రక్షాళన చేసేందుకు కష్టపడుతున్నామని మంత్రి అనిల్‌కుమార్‌ చెప్పారు. 2014 అంచనాలకే కట్టుబడి ఉన్నామని, అంతకుమించి డబ్బు అడగబోమంటూ అప్పటి సీఎం చంద్రబాబు రాసిన లేఖ ఇందుకు నిదర్శనమని మంత్రి ఎత్తి చూపారు. దీంతో రెచ్చిపోయిన చంద్రబాబు.. ‘పూనకం వచ్చినట్లుంది.

ఇది మంచిది కాదు. ఏం తమాషాలు చేస్తారా? ఎంతమందికి మైక్‌ ఇస్తారు? నా ప్రసంగం పూర్తయ్యేవరకు ఎవరికీ మైక్‌ ఇవ్వడానికి  లేదు. లేదంటే మేం మాట్లాడం.. మీరు పూర్తిచేయండి..’ అని స్పీకరు, మంత్రులవైపు వేలు చూపిస్తూ చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘వాస్తవం సూటిగా చెప్పాలని అడిగితే అది చెప్పకుండా చంద్రబాబు వయసును మర్చిపోయి అసహనం, ఆగ్రహం ప్రదర్శించడం సరికాదు. ఆయన బెదిరిస్తే బెదిరిపోయేవారు ఎవరూ లేరు..’ అని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు. ‘పరిస్థితులను బట్టి ఎన్నో డీపీఆర్‌లు ఇస్తుంటారు, 1986కు ముందు కూడా పోలవరంపై కేంద్రానికి అంచనాలు ఇచ్చారు..’ అంటూ  చంద్రబాబు ఏదేదో మాట్లాడారు. దీంతో కొలుసు పార్థసారథి జోక్యం చేసుకుని ‘2018లో 11 రాష్ట్రాలకు స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌ ఇచ్చినప్పుడు కూడా విభజనచట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని చంద్రబాబు ఒక్కమాట కూడా అడగలేదు. ప్యాకేజీకి లొంగిపోయారు.

ప్రధానికి చంద్రబాబు సీఎంగా రాసిన లేఖలో స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌ అనే మాటే లేదు. కావాలంటే చెప్పమను. నేను సవాల్‌ చేస్తున్నా..’ అన్నారు. దీంతో మైక్‌ తీసుకున్న చంద్రబాబు ‘ప్రాజెక్టు పూర్తిచేయాలనుకున్నప్పుడు వేర్వేరు మార్గాలు ఉంటాయి. మీకు చేతకాదు. చేతకాకపోతే నేర్చుకోండి. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. కేసుల భయంతో కేంద్రం వద్ద సాగిలపడ్డారు. ఆర్‌ అండ్‌ ఆర్, భూసేకరణ పూర్తిచేస్తారా? కేంద్రంతో పోరాడి ఆర్‌ అండ్‌ ఆర్‌ సాధిస్తారా? లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు’ అంటూ మళ్లీ ఊగిపోయారు. ఒక దశలో సీఎం వైఎస్‌ జగన్‌ వైపు వేలెత్తి చూపిస్తూ కళ్లు పెద్దవి చేసి బెదిరిస్తున్నట్లు హావభావాలు  ప్రదర్శించారు. తేల్చుకుందాం.. రా.. అంటూ చేతులతో పిలిచారు. బాబు రెచ్చగొడుతున్నా.. సీఎం జగన్‌ రెండు చేతులు జోడించి నమస్కారాలు చెప్పారు. 

వైఎస్సార్‌ విగ్రహం పెడితే కేంద్రం ఊరుకుంటుందా?: చంద్రబాబు
కేంద్ర నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే అక్కడ వైఎస్సార్‌ విగ్రహం పెడతారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ విగ్రహం ఏర్పాటుపై పెడుతున్న శ్రద్ధ ప్రాజెక్టుపై పెట్టడం లేదన్నారు. కేంద్రం నిధులివ్వకుంటే వైఎస్సార్‌ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఓ కారణం అవుతుందన్నారు. 

ర్యాలీగా అసెంబ్లీకి..
తాడికొండ: ఇసుక బంగారంలా మారిందని, ధరల పెంపుతో వచ్చిన ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని పేర్కొంటూ వెలగపూడిలో చంద్రబాబు బంగారం కొలిచే త్రాసుతో ఇసుకను తూకం వేశారు. అక్కడినుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. 

సభ నుంచి వెళ్లిపోయిన టీడీపీ సభ్యులు
పోలవరం మీద చర్చలో సీఎం జగన్‌ మాట్లాడుతున్నప్పుడు టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలారు. ‘మీకు అవకాశం ఇస్తాను. మీరు చెప్పాలనుకున్న విషయం చెప్పండి. ఇతర సభ్యులు మాట్లాడే సమయంలో.. ప్రత్యేకించి సభా నాయకుడు మాట్లాడే సమయంలో అడ్డుతగలడం మంచి విధానం కాదు’ అని స్పీకర్‌ పలుమార్లు టీడీపీ సభ్యులకు సూచించారు. సభావ్యవహారాల మంత్రి బుగ్గన కూడా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఫలితం లేకపోవడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేయమని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో 9 మంది టీడీపీ సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సస్పెండైన వారితోపాటు చంద్రబాబు, ఇతర టీడీపీ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడేటప్పుడు చంద్రబాబు మైక్‌ను కట్‌ చేస్తున్నారంటూ తెలుగుదేశం సభ్యులు పోడియంలోకి వెళ్లి నిరసన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement