సాక్షి, అమరావతి: ఒకవైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుండగా... వ్యవసాయ రంగంపై, రైతు స్థితిగతులపై సమగ్రంగా చర్చిస్తున్న రాష్ట్ర శాసనసభలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ వైఖరితో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరకు ‘ఈ రోజు సభలో నా కుటుంబాన్ని గురించి, నా సతీమణి గురించి కూడా ఆరోపణలు చేశారు. సభలో వారి పేర్లను ప్రస్తావించారు’ అంటూ ఆవేశంగా అరుస్తూ సభ నుంచి బయటకు వచ్చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు... ఆ తరవాత బయట విలేకరుల సమావేశం పెట్టారు.
తన భార్య గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తన కుటుంబంపై విమర్శల్ని సహించలేకపోతున్నానని చెబుతూ బోరుమని ఏడ్చారు. ఇక అసెంబ్లీకి వెళ్ళనని, ప్రజా క్షేత్రంలో తేల్చుకున్నాకే మళ్లీ సభలోకి అడుగుపెడతానని స్పష్టంచేశారు. మాట మాటకూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు... అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదు కనకే ఈ విషయం బయట చెబుతున్నానని పేర్కొన్నారు. నిజానికి అసెంబ్లీలో చంద్రబాబు భార్య పేరు గానీ, ప్రస్తావన గానీ రానేలేదు. ఎవ్వరూ ఆయన కుటుంబం గురించి మాట్లాడలేదు కూడా. అయినా వ్యవసాయంపై చర్చ జరుగుతున్నపుడు ఇలా వ్యక్తిగత అంశాలెందుకు ప్రస్తావనకు వచ్చాయనే సందేహం ఎవరికైనా సహజం. అదెలా జరిగిందంటే....
టీడీపీ అడ్డంకులు
ఉదయం 9కి సభ ప్రారంభం కాగానే ‘పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు’ అంశంపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్‌చేయగా వెంటనే ‘వ్యవసాయరంగం– రైతు సంక్షేమం’పై సభలో చర్చ మొదలైంది. 10 నిమిషాల తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభలోకి వచ్చారు. రైతు సంక్షేమంపై చర్చలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రెండున్నర ఏళ్లగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికీ, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న చర్యలను వివరిస్తూ... ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం రైతుల రుణమాఫీ, సున్నా వడ్డీ, ఇన్‌పుట్స్ సబ్సిడీ నిధుల కూడా మంజూరు చేయకుండా మోసం చేసిన తీరును అంకెలు, లెక్కలతో సహా వివరించారు.
ఈ సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయులు మంత్రి ప్రసంగానికి అడ్డుతగులుతూ తన సీట్లులో కూర్చొనే... పీఆర్పీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డిని, వైసీపీని ఉద్దేశించి కన్నబాబు చేసిన వ్యాఖ్యలున్న ఓ పేపరు కటింగ్‌ను ప్రదర్శించారు. దానికి మంత్రి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేయటంతో వివాదానికి బీజం పడింది. దానికి కన్నబాబు స్పందిస్తూ... ‘మాట్లాడదాం.. దాంతో పాటు ఎన్టీఆర్‌ను చంద్రబాబు తిట్టినన్ని తిట్లు ఎవరూ తిట్టలేదు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను సంఘ విద్రోహ శక్తిగా పేర్కొన్నారు. అయినా ఆ పార్టీలోని నేతలకు సిగ్గులేదు’ అని స్పందించారు.
మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకొని.. ‘చంద్రబాబు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండి ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్బాలు పలకలేదా. మళ్లీ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తాననలేదా? మళ్లీ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి... ఇపుడు ఆయన ఫొటోలకు దండాలు పెట్టడం లేదా?’’ అని ప్రశ్నించారు. స్పీకర్ అనుమతితో మైకు తీసుకున్న బాబు... ‘బాబాయి– గొడ్డలి పోటు మొదలు తల్లికి చేసిన ద్రోహం వరకు అన్నీ చర్చిద్దాం. మేం స్పష్టంగా ఉన్నాం అధ్యక్షా...’ అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సీఎం జగన్ సభలో లేరు. వర్షాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి వెళ్లారు.
జరిగే చర్చేంటి? ఈ మాటలేంటి?: బుగ్గన
బాబు వ్యాఖ్యల అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ‘అధ్యక్షా, రెండు రోజుల నుంచి సీమలో విపరీతమైన వర్షాలు, వరదలు. జరుగుతున్న చర్చ వ్యవసాయం మీద. ఈ వరద వల్ల ఆ నాలుగు జిల్లాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఇప్పుడు చర్చకు రాబోతోంది. చర్చకు, టీడీపీ వారు మాట్లాడే విధానానికి సంబంధం ఉందా?. వ్యక్తిగత అంశాలు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంత దూరం పోతుంది? అవసరమా ఇదంతా?’ అన్నారు.
కన్నబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... డెయిరీ రంగంలోని సహకార సంఘాలను చంద్రబాబు తన సొంత డెయిరీలు హెరిటేజ్, సంగం కోసం క్రమపద్ధతిలో నాశనం చేశారన్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దే క్రమంలోనే అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. దీనికి చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. స్పీకరుతో వాగ్వాదానికి దిగుతూ... ఆంధ్రా కంపెనీలు అక్కర్లేదా? గుజరాత్ కంపెనీలే కావాలా? అని తనను, తన కుటుంబాన్ని కించపరుస్తున్నారని, వీళ్లు రెండోసారి అధికారంలోకి రారని శాపనార్ధాలు పెట్టారు.
బాబాయి– గొడ్డలి.. తల్లీ చెల్లీ అంటూ టీడీపీ అరుపులు
ఈ సమయంలో టీడీపీ సభ్యులు ‘బాబాయి– గొడ్డలి’, ‘తల్లీ, చెల్లీ’.. అని అదేపనిగా అరవటం మొదలెట్టారు. అధికార వైసీపీ సభ్యులు దీనికి సమాధానంగా ‘పార్టీ లేదు–బొక్కా లేదు’ (గతంలో అచ్చెన్నాయుడు అన్నమాటలివి) అంటూ అరిచారు. అంబటి రాంబాబు జోక్యం చేసుకుంటూ సభ అదుపు తప్పడానికి టీడీపీయే కారణమని, తనకు కొంత సమయమివ్వాలని అడిగారు. టీడీపీ నేతలు గట్టిగా... ‘అరగంట చాలా... గంట కావాల్నా’ అని అనడంతో అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాటన్న వ్యక్తిని ఉద్దేశించి ‘నువ్వొస్తే గంట కావాలి, అన్నీ చర్చిద్దాం’ అన్నారు.
మల్లెల బాబ్జీ ఏం రాశారో గుర్తులేదా బాబూ?
ఈ సమయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి లేచి... గొడవ మొత్తానికి కారణం చంద్రబాబేనని, వ్యవసాయంపై ప్రశాంతంగా సాగుతున్న చర్చను తప్పుదోవ పట్టించారని చెప్పారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన్ని ఉద్దేశించి మల్లెల బాబ్జీ (ఎన్టీఆర్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తి) ఏమి రాశారో చదువుకోవాలంటూ ఆ లేఖను స్పీకర్‌కు పంపించారు. బాబాయి– గొడ్డలంటూ ముఖ్యమంత్రిపై ఏవేవో ఆరోపణలు చేయాలని చూస్తారా? అని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు గందరగోళానికి తెరతీయటంతో స్పీకర్ తమ్మినేని 11.25 ప్రాంతంలో సభను వాయిదా వేశారు.
ఆరంభించగానే... చంద్రబాబు ఆగ్రహం!
సభ తిరిగి మధ్యాహ్నం 12.14కు ప్రారంభమైంది. కన్నబాబు ప్రసంగం కొనసాగిస్తుండగా... టీడీపీ సభ్యులు వస్తూనే స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమ నాయకుడికి మైకు ఇవ్వాలని పట్టుబట్టారు. చంద్రబాబు కూడా తన సీటులో నుంచి లేచి నిలబడి మైకు ఇవ్వాలని గట్టిగా అరిచారు. దీంతో స్పీకర్ 12.17కి చంద్రబాబుకి మైకిచ్చారు.
మహానాయకులతో కలిసి పని చేశా...
8వసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టా. 1978 నుంచి హేమాహేమీలతో పని చేశా. ఎన్నో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాం. కానీ ఇలాంటి అనుభవం ఎన్నడూ ఎదురుకాలేదు. నా కుటుంబాన్ని, భార్యను కూడా సభలో ప్రస్తావించే పరిస్థితి వచ్చింది... అంటుండగా మైకు కట్ కావటంతో... ఆవేశంగా నమస్కారం పెట్టి అచ్చెన్నాయుడితో కలిసి బయటకు వెళ్లిపోయారు. బయట విలేకరుల సమావేశం పెట్టి భోరుమన్నారు. ఇదీ.. జరిగింది. బాబు కుటుంబం గురించి ఎవ్వరూ ప్రస్తావించకున్నా అదే కారణంతో ఇంత వివాదం జరగటం గమనార్హం!!.
వీడియో తీయించి వదిలారు!
సభలో మైక్ కట్ అయిన తరువాత చంద్ర బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతా! అంతవరకూ అడుగుపెట్టను!’’ అని అన్నారు. ఆ సమయం లో మైకు లేదు కనక ఆయన పక్కనున్న టీడీపీ సభ్యుడితో సెల్ ఫోన్లో వీడియో తీయించారు. ఆ వీడియోను క్షణాల్లో బయటకు లీక్ చేశారు. కాకపోతే విలేకరుల సమావేశంలో మాత్రం మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడ తాననే వ్యాఖ్యలు చేయ లేదు. ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాకే అసెంబ్లీలో అడుగుపెడతానని
చెప్పటం గమనార్హం.
తల్లీ, చెల్లీ– బాబాయి, గొడ్డలి అన్నదే బాబు: బొత్స
బాబు బృందం బయటకు వెళ్లిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల విషయాన్ని తీసుకు వచ్చిందీ, బాబాయి–గొడ్డలి, తల్లీ– చెల్లీ అన్న దే చంద్రబాబన్నారు. కావాలంటే రికార్డులు చూడాలని కోరారు. ’ఆయన గురించి ఆయనే మాట్లాడుకుని మమ్మల్ని అంటే ఎలా?’ అని ప్రశ్నించారు. బాబు లాగా తాము వెన్నుపోటు పొడవలేదన్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ఆవేళ జగన్ సభ నుంచి బయటకు వెళ్లి అధికారం లోకి వచ్చిన తర్వాతే సభకు వచ్చారన్నారు. ’కానీ ఈ బాబు ఏమి చేశారు.
తన వ్యక్తిగత సమస్యల కోసం, రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాలను తాకట్టుపెట్టేలా సభ నుంచి వెళ్లిపోయారు. వర్షాలతో ప్రజలు అల్లాడి పోతుంటే సీఎం జగన్ అధికారులతో సమీక్షించి చర్యలు చేపడుతుంటే కనీసం మాట మాత్ర మైనా ఈ పెద్దమనిషి ఏం చేద్దాం అని అడి గారా? తల్లీ చెల్లీ, బాబాయంటూ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారా? అదే మాట్లా డాలనుకుంటే నోటీసు ఇమ్మనండి.. మాట్లాడు కుందాం.. అలా చేయడానికి బదులు నేర తలంపుతో వ్యవహరించారు. రాష్ట్ర ప్రజలపై ఆయనకు శ్రద్ధ లేదు. అందువల్ల ప్రజానీకానికి నా విజ్ఞప్తి ఒక్కటే. చంద్రబాబు స్వార్ధప్రయో జనాల కోసం సభ నుంచి వెళ్లిపోయారని గమనించండి’ అని బొత్స చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment