సాక్షి, అమరావతి: ‘ఇది బాబు స్కీమ్.. ఇది జగన్ స్కీమ్ అంట. ప్రభుత్వంలో బాబు స్కీమ్.. జగన్ స్కీమ్ ఉంటాయా? మళ్లీ వీటిపై ప్రభుత్వ డబ్బుతో యాడ్స్ ఇచ్చుకుంటారు. ఆడి పేపర్‌కి, మళ్లీ ఇంకో పేపర్‌కి. ఏమనాలి వీణ్ణి.. ఇంగిత జ్ఞానం ఉందా?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేశారు. ‘క్రాప్ ఇన్సూరెన్స్ (పంటల బీమా) ఇప్పుడు కడతామంటున్నారు. ఎవరైనా ఒప్పుకుంటారా? రుణమాఫీకి మేము రూ.15 వేల కోట్లే ఇచ్చామని ఆ మంత్రి అంటాడు, వెనకాల ఎవడో కాదు రూ.12 వేల కోట్లే అంటాడు. వాడి బడ్జెట్‌లోనే రూ.15 వేల కోట్లని చెప్పాడు. వీడు అదే చెబుతాడు. ఒకటిన్నర సంవత్సరం అయింది నువ్వొచ్చి. నువ్వు ఇవన్నీ చేస్తావా? ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా వచ్చినవాళ్లు ఏదేదో చేస్తున్నారు..’ అంటూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఇష్టానుసారం దూషించారు. బీ కేర్ ఫుల్ అని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు తిడుతూనే తాను 40 ఏళ్లు హుందాగా రాజకీయం చేశానని చెప్పుకొచ్చారు. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. (చదవండి: బాబు.. నేలబారు రాజకీయం)
ఫస్ట్ టైమ్ ఫేక్ సీఎంను చూస్తున్నా..
‘నా జీవితంలో ఎప్పుడూ వెల్‌లోకి వెళ్లలేదు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు కూడా వెళ్లలేదు. రైతుల విషయంలో సీఎం తీరు నచ్చక తొలిసారి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బైఠాయించా. మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? నేను ఎంతోమంది సీఎంలను చూశా. నా జీవితంలో ఫస్ట్ టైమ్ ఫేక్ సీఎంను చూస్తున్నా. అసెంబ్లీకి సీఎం ఆలస్యంగా వచ్చాడు. సీఎం రాలేదని సమావేశాలు ప్రారంభించలేదు. జగన్ వయసు నా రాజకీయ అనుభవమంత లేదు.
రాష్ట్రంలో రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం దానిపై చర్చించకుండా సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రైతులకు చెందిన పంటల బీమాను ఎందుకు క్లెయిమ్ చేయలేదు? ఈ ఏడాది రూ.1,300 కోట్లు కట్టి ఉంటే కనీసం మూడు, నాలుగు వేల కోట్ల ఇన్సూరెన్స్ అయినా రైతులకు వచ్చేది. ఉన్న వ్యవస్థను కుప్ప కూల్చి కొత్త వ్యవస్థ తెస్తామంటూ ఉత్తి మాటలు చెబుతున్నారు. జగన్ ఫేక్ ముఖ్యమంత్రి..’ అంటూ ఆరోపణలు చేశారు.(చదవండి: ఈ ప్రభుత్వం రైతుల పక్షం: సీఎం జగన్)
ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వరా?
‘అసెంబ్లీకి మూడు ఛానళ్లను రానివ్వకుండా చేశారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షిని అలా చేయలేదు. ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్ర భవిష్యత్‌తో ఆడుకుంటారా, మమ్మల్ని అవమానిస్తారా? ఏం చేస్తారు నన్ను చంపేస్తారా? ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వరా?’ అని బాబు అన్నారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, రైతులకు జరిగిందని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇలాగే తనను అవమానిస్తే హెచ్చరించానని, ఆయన వెంటనే లేచి క్షమాపణ చెప్పారని చెప్పుకొచ్చారు. ‘మీరు ఏ పూనకంలో ఓటేశారో తెలియదు కానీ, మీ కోసం జీవితంలో ఎన్నడూ లేని అవమానాలు ఎదుర్కొన్నా’ అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు వరికి హెక్టారుకు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, కులవృత్తుల వారికి రూ.15 వేలు ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment