అక్కయ్యపాలెం వద్ద రోడ్‌షోలో మాట్లాడుతున్న చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆటవిక రాజ్యం కొనసాగించడానికి రాష్ట్రం నీయబ్బ సొత్తా. కొన్ని రోజులు పోయాక బట్టలేసుకుని తిరిగే పరిస్థితి ఉండాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకో’ అంటూ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు. బీచ్ రోడ్డును తానే అభివృద్ధి చేశానని, విశాఖ అగ్ర నగరంగా తయారు కావాలని కాంక్షించానని, ఈ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపానని చెప్పారు. కాయకష్టం చేసేవారికి ఒక పెగ్గు వేసి పడుకోవడం అలవాటు అని, వారికి నాసిరకం బ్రాండ్లను మూడు రెట్లు ధరలు పెంచి అమ్ముతుండటం సిగ్గు చేటని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ను ఎలా పరిరక్షించాలా అని టీడీపీ తాపత్రయ పడుతుంటే.. వైఎస్ జగన్ మాత్రం 7 వేల ఎకరాల్ని అమ్మేయాలంటున్నారని విమర్శించారు. విశాఖ నగరంలో అడ్డపంచెలు కట్టుకుని దిగి, భూకబ్జాలు చేస్తూ, సెటిల్‌మెంట్ ఆఫీస్‌లు ఏర్పాటు చేశారన్నారు. విశాఖ నగరానికి శనిగ్రహం పట్టిందని, నగరంపై విజయసాయిరెడ్డి పెత్తనమేంటని ప్రశ్నించారు.
లోకేశ్‌ను మించిపోయిన బాబు
అబద్ధపు ప్రచారాలు, పొంతన లేని మాటలు చెప్పే నారా లోకేశ్‌ను మించిపోయేలా చంద్రబాబు విశాఖ పర్యటనలో మాట్లాడారు. నివాసయోగ్య నగరాల్లో విశాఖ నగరం 3వ స్థానం నుంచి 46వ స్థానానికి పడిపోయిందంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2018లో చంద్రబాబు హయాంలో విశాఖ నగరం 17వ స్థానంతో సరిపెట్టుకుంటే.. ఈసారి 2 స్థానాలు మెరుగుపడి 15వ స్థానంలో నిలిచింది. చంద్రబాబు మాత్రం 46వ స్థానం వచ్చిందని చెప్పడంతో జనం ఆశ్చర్యపోయారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, సిమెంట్, గ్యాస్, నిత్యావసరాల ధరలను సీఎం జగన్ పెంచేశారంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా పొంతన లేని మాటలు చెప్పడంతో అక్కడి వారంతా అసహనం వ్యక్తం చేశారు.
మేయర్ అభ్యర్థిగా పీలా
పెందుర్తి రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా 96వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు పేరును చంద్రబాబు ప్రకటించారు.
బీసీ సంఘాల మండిపాటు
చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువత
తొలుత విశాఖ విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబుపై ఉత్తరాంధ్ర బీసీ సంఘాలు మండిపడ్డాయి. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద బీసీ సంఘాలు ప్రయత్నించాయి. పోలీసులు అడ్డుకోవడంతో విమానాశ్రయ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానికి చంద్రబాబు అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయాన్ని స్పష్టం చేసిన తర్వాతే ప్రచారానికి వెళ్లాలని, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా.. రాత్రి 9 గంటలకు అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా.. వంద మందికి పైగా యువకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రాజధాని రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుకు.. విశాఖలో తిరిగే హక్కు లేదంటూ నినాదాలు చేయగా.. పోలీసులు వారిని నిలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment