సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. ఆర్గనైజ్డ్ క్రిమినల్ కూడా.. ఈ మాట సీఎం వైఎస్ జగన్ గతంలోనే చెప్పారు. ఇప్పటికి రుజువైంది. చంద్రబాబు నేర ప్రవృత్తితో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు నూతన ఆంధ్రప్రదేశ్‌ను కూడా సర్వనాశనం చేశాడు. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించి, సామాన్యుడికి రాజకీయాలను దూరం చేసిన దుర్మార్గుడు’’ అని దక్షిణ కోస్తా జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన తరువాత మంగళవారం ఒంగోలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు జీవితం అంతా నీచ, నేర, కుట్ర రాజకీయాలేనంటూ ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ పిలుపునిచ్చిన బంద్‌కు రాష్ట్ర ప్రజలు అస్సలు స్పందించలేదన్నారు. టీడీపీ శ్రేణుల్లో కూడా స్పందన కరువైందన్నారు. రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను కూడా మూసేయకుండా వాళ్ల వ్యాపారం వాళ్లు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో సానుభూతి సంపాదించడం కోసం చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని నేతలను ఇక్కడకు రప్పించుకోవడానికి తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు.
అయితే చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి ఎల్లో మీడియా మాత్రం ఆయన సచ్ఛీలుడని, సౌమ్యుడని, మహానాయకుడు, అంతర్జాతీయ నాయకుడని, ఉదార స్వభావుడని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందన్నారు. దానిలో వాళ్లు విఫలం అయ్యారని చెప్పారు. చంద్రబాబు స్వతహాగా నేర స్వభావం, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అన్నారు. విద్యార్థి దశ నుంచే ఎస్వీ యూనివర్సిటీలో చేసిన నీచరాజకీయాలు, అకృత్యాలు చంద్రబాబు స్వభావాన్ని తెలుపుతాయన్నారు.
డబ్బుంటేనే రాజకీయాలనేది బాబు సిద్ధాంతం
డబ్బుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి చంద్రబాబు అని విజయసాయిరెడ్డి విమర్శించారు. అందుకే సీమెన్స్ కంపెనీ పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్మును అప్పనంగా కాజేశాడని ధ్వజమెత్తారు. మల్టీ నేషనల్ కంపెనీ పేరు చెప్పి రూ. 370 కోట్లు తన బినామీ కంపెనీల అకౌంట్లలో వేసుకున్న తీరును సీఐడీ కోర్టు ముందు పెట్టిందన్నారు. ఈ విషయంలో లోకేశ్ అనుచరుడు కిలారు రాజేష్ కీలక భాగస్వామి అని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రజాధనాన్ని సొంత ఖాతాల్లో వేసుకున్నారని తెలిపారు.
రాజకీయాలను భ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబేనని చెప్పారు. కాదని ఎవరైనా అంటే ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పారు. రాజకీయాలను సామాన్యులకు దూరం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. అవినీతిలో చంద్రబాబు, రామోజీరావులది విడదీయరాని బంధమన్నారు. చంద్రబాబు తప్పులను కప్పిపెట్టి ఆయనో విజనరీ అంటూ రామోజీ ప్రచారం చేసేవాడన్నారు. ఇద్దరూ కలిసి రాజకీయాలను భ్రష్టు పట్టించారని చెప్పారు.
అవినీతిలో రామోజీరావు పాత్రపై కూడా విచారణ జరపాలన్నారు. బాబు నీతిమంతుడని భావిస్తే.. ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ కోరాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కేసులన్నింటిలో శిక్ష పడితే చంద్రబాబు జీవితాంతం జైలు నుంచి బయటకు రాలేడని తెలిపారు. కాగా, ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment