
రామచంద్రపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను చూసి ఓర్వలేని విపక్ష నేత చంద్రబాబు.. ఉత్తరాంధ్ర పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో అశాంతి, అలజడులు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ సమగ్రంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేసేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన సామాజిక వర్గానికి చెందిన వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలనుకుంటున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్ర పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రజలను రెచ్చగొట్టేందుకే చేస్తున్న ఈ పాదయాత్రలో ఎక్కడైనా ఏదైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలని మంత్రి స్పష్టం చేశారు. లేని అమరావతిని, పోలవరాన్ని చూపించడానికి ప్రజలకు తీసుకువెళ్తున్నామని చెప్పి అప్పట్లో రూ. 7 కోట్లు దోచుకున్నారన్నారు. ఇక చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఒకదానితో మరోటి పొంతన లేకుండా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వివాహ సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల్ని ప్రారంభిస్తున్నామన్నారు. అక్టోబర్ 1నుంచి అమలయ్యే ఈ పథకాన్ని సచివాలయాల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 98.44 శాతం నెరవేర్చటంలో ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. చంద్రబాబు గతంలో కళ్యాణమస్తు ప్రకటన చేసి 17,909 మందికి రూ. 68.68 కోట్లు ఎగ్గొట్టారని మంత్రి వేణు చెప్పారు.