అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు | Chengala Venkata rao comments on Chandrababu | Sakshi
Sakshi News home page

అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు

Published Mon, Dec 20 2021 4:06 AM | Last Updated on Mon, Dec 20 2021 5:09 AM

Chengala Venkata rao comments on Chandrababu - Sakshi

నక్కపల్లి/పాయకరావుపేట: అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు ఆరోపించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం పదవి కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావును గద్దె దింపి ఆయన మరణానికి కారణమయ్యాడని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందన్న సందేహాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయని చెప్పారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ను సైతం అంతమొందించాలన్న కుట్రకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వరద ప్రాంతాల్లో పరామర్శ సమయంలో ‘గాల్లో వచ్చి గాల్లోనే పోతాడు, నాతో పెట్టుకున్న వైఎస్‌ పరిస్థితి ఏమైంది’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రజల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని వివరించారు.

దళితులతో బాబు ఓటు బ్యాంకు రాజకీయం
వైఎస్‌ జగన్‌.. తనను అక్కున చేర్చుకుని 2014లో పాయకరావుపేట టికెట్‌ ఇస్తే, పక్క నియోజకవర్గ నాయకుడికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఆశ చూపి.. తన ఓటమికి కష్టపడ్డారన్నారు. దళితులకు పూర్తి న్యాయం చేసింది జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని చెప్పారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ఆయనదేనన్నారు. చంద్రబాబు దళితులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక, కుటుంబీకులను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.

చంద్రబాబు ఐదేళ్ల పాటు మోదీ చంక నాకి, ఆ తర్వాత మోదీని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని శపథం చేశాడని.. ఇప్పుడు అమిత్‌షా, మోదీ కాళ్లు పట్టుకోవడం కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. 23 సీట్లతో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా చంద్రబాబుకు సిగ్గు లేదని, లోకేశ్‌ ఎప్పటికీ సీఎం కాలేడని చెప్పారు. టీడీపీలో ఎవరైనా ఎదుగుతుంటే రాజకీయంగా, భౌతికంగా అంతమొందించడం తండ్రీ కొడుకులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. జీఎంసీ బాలయోగి, ఎలిమినేటి మాధవరెడ్డి, ఎర్రన్నాయుడు వంటి నాయకుల మరణానికి చంద్రబాబే కారణమన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు.  వైఎస్‌ జగన్‌ అభ్యున్నతి కోసం తాను ఎప్పటికీ శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement