chengala venkata rao
-
అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు
నక్కపల్లి/పాయకరావుపేట: అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు ఆరోపించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం పదవి కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావును గద్దె దింపి ఆయన మరణానికి కారణమయ్యాడని ఆరోపించారు. దివంగత సీఎం వైఎస్సార్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందన్న సందేహాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయని చెప్పారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ను సైతం అంతమొందించాలన్న కుట్రకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వరద ప్రాంతాల్లో పరామర్శ సమయంలో ‘గాల్లో వచ్చి గాల్లోనే పోతాడు, నాతో పెట్టుకున్న వైఎస్ పరిస్థితి ఏమైంది’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రజల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని వివరించారు. దళితులతో బాబు ఓటు బ్యాంకు రాజకీయం వైఎస్ జగన్.. తనను అక్కున చేర్చుకుని 2014లో పాయకరావుపేట టికెట్ ఇస్తే, పక్క నియోజకవర్గ నాయకుడికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఆశ చూపి.. తన ఓటమికి కష్టపడ్డారన్నారు. దళితులకు పూర్తి న్యాయం చేసింది జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని చెప్పారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ఆయనదేనన్నారు. చంద్రబాబు దళితులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక, కుటుంబీకులను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాటు మోదీ చంక నాకి, ఆ తర్వాత మోదీని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని శపథం చేశాడని.. ఇప్పుడు అమిత్‌షా, మోదీ కాళ్లు పట్టుకోవడం కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. 23 సీట్లతో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా చంద్రబాబుకు సిగ్గు లేదని, లోకేశ్ ఎప్పటికీ సీఎం కాలేడని చెప్పారు. టీడీపీలో ఎవరైనా ఎదుగుతుంటే రాజకీయంగా, భౌతికంగా అంతమొందించడం తండ్రీ కొడుకులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. జీఎంసీ బాలయోగి, ఎలిమినేటి మాధవరెడ్డి, ఎర్రన్నాయుడు వంటి నాయకుల మరణానికి చంద్రబాబే కారణమన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ అభ్యున్నతి కోసం తాను ఎప్పటికీ శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. -
ఇండిపెండెంట్‌గా చెంగల కుమార్తె?
విశాఖపట్నం, నక్కపల్లి : పాయకరావుపేట నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్థి(ఇండిపెండెంట్)గా మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు కుమార్తె చెంగల విజయలక్ష్మి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈనెల 22న ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. మూడుసార్లు పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసి టికెట్ ఇవ్వాలని కోరిన చెంగల కుటుంబం చివరి క్షణంలో బాబు హ్యాండ్ ఇవ్వడంతో ఖంగుతింది. దీంతో ఇండిపెండెంట్‌గా టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి తమ సత్తా ఏంటో చూపించాలన్న యోచనలో చెంగల కుటుంబం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 1999 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు పాయకరావుపేట ఎమ్మెల్యేగా పని చేసిన చెంగలకు నియోజకవర్గంలో తన కంటూ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కపైసా ఆశించకుండా పలువురికి లబ్ది చేకూరే విధంగా పనులు చేసి పెట్టారు. కొన్ని కారణాలవల్ల 2013లో వైఎస్సార్సీపీలో చేరి 2014లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీలో తనకున్న పరిచయాలను కొనసాగిస్తూనే వస్తున్నారు. 2007లో బంగారయ్యపేటలో జరిగిన ఘర్షణలో హత్యాయత్నం కేసుకు సంబంధించి ప్రస్తుతం చెంగల యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. బెయిల్‌పై వచ్చిన చెంగల ఈనెల 12నే గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లారు. బెయిల్ గడువు ముగియడానికి ముందు ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అదే గనుక జరిగితే టీడీపీకి గట్టి దెబ్బతగులుతుందని భావించిన చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడి చెంగలను జనసేనలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ టికెట్ ఆశ చూపించారు. చెంగలకు బదులు ఆయన కుమార్తెకు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీన్ని నమ్మిన చెంగల జనసేనలోకి వెళ్లకుండా ఆగిపోయారు. టీడీపీలో ఉన్న ముఖ్య నాయకులను నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులను కలసి మద్దతు కూడగట్టారు. అయితే చంద్రబాబు అనూహ్యంగా డాక్టర్ బంగారయ్యను తెరమీదకు తెచ్చి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చెంగల వర్గం విజయలక్ష్మిని టీడీపీ రెబెల్ అభ్యర్థిగా నిలపాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈమేరకు పార్టీలో ఉన్న తమ అభిమానులతో చర్చలు జరిపారు. ఈనెల 22న నామినేషన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. -
దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్!
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు నాంపల్లి క్రిమినల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. నిర్మాత చెంగల వెంకట్రావు దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు గైర్హాజరు కావడంతో వారెంట్ ను జారీ చేసింది. ఓ సినిమా కథ కోసం చెంగల వెంకట్రావు వద్ద విజయేంద్ర ప్రసాద్ 41 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అయితే తమ మధ్య ఒప్పందంను ఉల్లంఘించడం జరగడం, సొమ్ము వెనక్కి తిరిగి ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేశారు. ఆంధ్ర బ్యాంక్ కు చెందిన రెండు చెక్కులను విజేంద్ర ప్రసాద్.. చెంగల కు ఇచ్చారని.. అవి బౌన్స్ కావడంతో .. విజయేంద్ర ప్రసాద్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. -
చంద్రబాబుది ఏ వాదమో స్పష్టం చేయాలి: చెంగల
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెంగల వెంకట్రావు నిప్పులు చెరిగారు. విశాఖపట్నం నగరంలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన నాయకత్వం వహించారు. తెలంగాణ వాదో లేక సమైక్యవాదో వెంటనే చంద్రబాబు స్పష్టం చేయాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. అలా చేయకుంటే చంద్రబాబు త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రను ఖచ్చితంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. గతంలో చెంగల వెంకట్రావు విశాఖపట్నంలోని పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.