నాయకుల మద్దతు కూడగడుతున్న చెంగల కుటుంబం
విశాఖపట్నం, నక్కపల్లి : పాయకరావుపేట నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్థి(ఇండిపెండెంట్)గా మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు కుమార్తె చెంగల విజయలక్ష్మి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈనెల 22న ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. మూడుసార్లు పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసి టికెట్ ఇవ్వాలని కోరిన చెంగల కుటుంబం చివరి క్షణంలో బాబు హ్యాండ్ ఇవ్వడంతో ఖంగుతింది. దీంతో ఇండిపెండెంట్‌గా టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి తమ సత్తా ఏంటో చూపించాలన్న యోచనలో చెంగల కుటుంబం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 1999 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు పాయకరావుపేట ఎమ్మెల్యేగా పని చేసిన చెంగలకు నియోజకవర్గంలో తన కంటూ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కపైసా ఆశించకుండా పలువురికి లబ్ది చేకూరే విధంగా పనులు చేసి పెట్టారు. కొన్ని కారణాలవల్ల 2013లో వైఎస్సార్‌సీపీలో చేరి 2014లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీలో తనకున్న పరిచయాలను కొనసాగిస్తూనే వస్తున్నారు.
2007లో బంగారయ్యపేటలో జరిగిన ఘర్షణలో హత్యాయత్నం కేసుకు సంబంధించి ప్రస్తుతం చెంగల యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. బెయిల్‌పై వచ్చిన చెంగల ఈనెల 12నే గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లారు. బెయిల్ గడువు ముగియడానికి ముందు ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అదే గనుక జరిగితే టీడీపీకి గట్టి దెబ్బతగులుతుందని భావించిన చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడి చెంగలను జనసేనలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ టికెట్ ఆశ చూపించారు. చెంగలకు బదులు ఆయన కుమార్తెకు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీన్ని నమ్మిన చెంగల జనసేనలోకి వెళ్లకుండా ఆగిపోయారు. టీడీపీలో ఉన్న ముఖ్య నాయకులను నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులను కలసి మద్దతు కూడగట్టారు. అయితే చంద్రబాబు అనూహ్యంగా డాక్టర్ బంగారయ్యను తెరమీదకు తెచ్చి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చెంగల వర్గం విజయలక్ష్మిని టీడీపీ రెబెల్ అభ్యర్థిగా నిలపాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈమేరకు పార్టీలో ఉన్న తమ అభిమానులతో చర్చలు జరిపారు. ఈనెల 22న నామినేషన్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment