సాక్షి, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సిద్ధమైంది. అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. తొలి దశలో పోలింగ్ జరుగనున్న ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలున్నారు. తొలిదశలో మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాల్లో 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.]
మొత్తం 5,304 పోలింగ్ స్టేషన్లకు గాను 25,429 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) చెప్పారు. పది నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మరో 10 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. మొదటి విడత పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్‌లోని 12 నియోజకవర్గాల్లో జరగనున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగా(సీఏపీఎఫ్)లున్నాయి.
తొలిదశలో బరిలో ఉన్న అభ్యర్థులలో బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్‌తో పాటు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఐదుగురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ సహా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్‌లు బరిలో ఉన్నారు. తొలిదశలోని 20 స్ధానాల్లో ముఖ్యంగా చిత్రకోట్, రాజ్‌నంద్‌గావ్, కవర్ధా, కొండగావ్, కొంటా, కేశ్‌కాల్, నారాయణ్‌పూర్, బిజాపూర్, అంతాగఢ్, దంతెవాడ నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.
రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ మాజీ సీఎం రమణ్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ల మధ్య నెలకొంది. రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ సీటు రమణ్ సింగ్‌కు బలమైన కోటగా పరిగణిస్తారు. 2008 నుంచి 2018 వరకు ఈ స్థానం నుంచి గెలుపొందారు. రమణ్‌సింగ్‌కు పోటీగా కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ను ఇక్కడి నుంచి పోటీకి దింపింది. చిత్రకోట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి వినాయక్ గోపాల్ దీపక్‌కు సవాల్ విసిరారు.
కొండగావ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ మార్కంకు కాంగ్రెస్ మళ్లీ టికెట్ ఇవ్వగా.. రమణ్‌సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన లతా ఉసేందిని బీజేపీ రంగంలోకి దింపింది. కవార్ధా అసెంబ్లీ స్థానం నుంచి భూపేశ్ బఘేల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహమ్మద్ అక్బర్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా, అక్బర్‌ను ఓడించేందుకు బీజేపీ విజయ్ శర్మను రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా ఒడిశా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కొంట అసెంబ్లీ 24 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అదీనంలో ఉంది. కొంటా నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కవాసీ లఖ్మాను కాంగ్రెస్ పోటీకి దింపింది.
Comments
Please login to add a commentAdd a comment