గుంటూరు: కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు సామరస్యంగా మెలుగుతుంటే చంద్రబాబు ఓర్వలేరని క్రైస్తవ సంఘాల నాయకులు మండిపడ్డారు. క్రైస్తవులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మగౌరవ సభలో నాయకులు మాట్లాడుతూ.. క్రైస్తవులు మతమార్పిడులకు పాల్పడటం లేదని, అలా ఎక్కడైనా జరిగివుంటే రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ క్రైస్తవులను అవమానించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. క్రైస్తవులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపిస్తామని వారు ధ్వజమెత్తారు.
కులమతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. విగ్రహాలు ధ్వంసం చేసింది టీడీపీ వాళ్లేనని సాక్షాధారాలతో సహా రుజువైందని, దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వారు నిలదీశారు. ఆలయాలపై దాడుల కేసులతో క్రైస్తవులకు ఎటువంటి సంబంధం లేదని, తమను తప్పుగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో చంద్రబాబును రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. విగ్రహాలు ధ్వంసానికి పాల్పడిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ బిషప్స్ కౌన్సిల్, పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్స్ ఫోరం, తదితర క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఫిలిప్ సి తోచర్‌కు బెదిరింపు కాల్స్..
ఇటీవల టీడీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. 38 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఆయన.. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్‌లతో కలిసి పని చేశారు. పార్టీకి రాజీనామా చేసిన నాటి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని డీజీపీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ నెంబర్లను డీజీపీకి ఇచ్చానని తెలిపారు. కాగా, క్రైస్తవుల పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment