న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి వదులుకోవాలని తాను అనుకుంటున్నప్పటికీ ఆ పదవి తనను వదిలి పెట్టబోదని రాజస్తాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని పరోక్షంగా తేల్చిచెప్పారు. సీఎం పదవిపై ఆశలు పెట్టుకోవద్దంటూ పార్టీలో తన ప్రత్యర్థి అయిన సచిన్ పైలట్‌కు నర్మగర్భంగా సూచించారు.
గహ్లోత్ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘దేవుడి దయతో మీరు నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని ఓ మహిళా నాతో చెప్పింది. ముఖ్యమంత్రి పోస్టు వదులుకోవాలని నేను అనుకుంటున్నా అది నన్ను వదలడం లేదని ఆమెతో చెప్పా. ఇక ఎప్పటికీ ఆ పదవి నన్ను వదలకపోవచ్చు’ అని గహ్లోత్ వెల్లడించారు. రాజస్తాన్‌లో సీఎం పోస్టు కోసం ఈసారి సచిన్ పైలట్ గట్టిగా పోటీపడుతున్నారు.
ఈ నేపథ్యంలో గహ్లోత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయని ప్రత్యర్థులు అంటున్నారు. ఎవరికి టికెట్లు ఇచ్చినా అభ్యంతరం లేదు. ఎవరికి టికెట్లు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. పైలట్ వర్గం సహా అందరితో చర్చించి, అభ్యర్థులను ఖరారు చేస్తామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి పదవిని ఎవరికి అప్పగించాలో పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధే తమ పార్టీని గెలిపిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి వదులుకుంటానని చెప్పే ధైర్యం దేశంలో ఎంతమంది సీఎంలకు ఉందని ప్రశ్నించారు. రాజస్తాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment