సాక్షి, హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో అదనంగా ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా?. పైపుల కోసమే మిషన్ భగీరథ స్కీం పెట్టినట్లు ఉంది అని ఎద్దేవా చేశారు.
కాగా, భట్టి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనబడుతున్నాయి తప్ప బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని చూపిస్తారా?. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తెలంగాణ ప్రజలకు అవసరమైనవే. ఉచిత విద్యుత్ ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు వైఎస్సార్. ఉచిత కరెంట్.. విద్యుత్ ఉత్పత్తులపై పేటెంట్ హక్కు కాంగ్రెస్‌దే. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనంగా నాలుగు శాతం విద్యుత్ కేటాయించాం.
కరెంట్ ఇచ్చింది మేమే..
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారు?. 24 గంటల కరెంట్ ఇస్తుంటే లాగ్‌బుక్స్ ఎందుకు దాచిపెట్టారు?. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని హామీలను నెరవేరుస్తాం. సంపద సృష్టించే అవకాశాలపై ఫోకస్ పెడతాం. మొట్టమొదటి సారి భూములపై హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. మా పార్టీ హయాంలోనే పాస్‌పుస్తకాలు, పట్టాదారీ పుస్తకాలు ఇచ్చాం.
ధరణి పెద్ద స్కాం..
దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కాం ధరణి. కేసీఆర్ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు. ధరణి పెట్టింది దోచుకోవడానికే. ఏ రికార్డ్ చూసి ధరణిలో భూముల వివరాలు నమోదు చేశారు?. మధిర నియోజకవర్గంలో ప్రజలు నన్నే నమ్ముతారు. కాంగ్రెస్ సునామీలా.. భారీ మెజార్టీతో గెలవబోతుంది. 70-85 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. వందకు వంద శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎం పదవిని ఆశించడంతో తప్పులేదు. కాంగ్రెస్‌లో అందరి అభిప్రాయం తీసుకుని ప్రొసీజర్స్ ప్రకారం సీఎంను ఎన్నుకుంటారు. అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం అభ్యర్థి ఎన్నిక.
కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం..
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆశయాలు నెరవేరలేదు. మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు చేయిస్తాం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోనే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటో తేలిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లు అన్నింటిలోనూ అవినీతి జరిగింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే అతి తక్కువ ఖర్చుతో తెలంగాణకు గోదావరి నీళ్లు వచ్చేవి. అనేక అబద్ధాలు చెప్పి కేసీఆర్ ఓట్లు వేయించుకున్నాడు. చెప్పిన పనులను పదేళ్లుగా కేసీఆర్ చేయలేదు. కేసీఆర్ ఏ హామీ ఇచ్చినా ప్రజలు పట్టించుకోవడం లేదు. తీసుకొచ్చిన అప్పులను కేసీఆర్ ఏం చేశారు?. 2 లక్షల ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment