సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. కరోనాను నియంత్రణ చేసేందుకు సీనియర్ ఐఏఎస్ లతో ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు.. కోవిడ్ ను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జూమ్ మాధ్యమం ద్వారా పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కేసీఆరే కారణమని అన్నారు. లాక్‌డౌన్‌ను 15 రోజుల పాటు కొనసాగించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మినిమం క్వారంటైన్ రోజుల పాటు లాక్ డౌన్ పెడితే కరోనా చైన్ లింక్ బ్రేక్ అవుతుందని సైంటిస్టులు, వైద్యులు, ఐ.ఎం.ఎ చెబుతోందని.. దీనిని ఖచ్చితంగా కేసీఆర్ అమలు చేయాలని భట్టి డిమాండ్ చేశారు.
గత బడ్జెట్ సమావేశాల్లోనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నేను చేసిన సూచనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ తప్పనిసరిగా పరీశీలన చేస్తానని చెప్పారు.. ఏడాది గడచినా.. కరోనాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రిపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యమైనవి.. వాటిని కాపాడుకునేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని భట్టి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ ను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్ లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్, కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్.. బెడ్స్.. ఆక్సిజన్ వంటి అన్నింటినీ ఆ కమిటీనే మానిటర్ చేసేలా ఉండాలని ప్రభుత్వానికి భట్టి సూచించారు.
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు భట్టి. నాలుగుకోట్ల జనాభాకు ఎన్ని డోసులు కావాలి? ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? అన్న వాటిపై ఖచ్చితమైన యాక్షన్ ప్లాన్ ఈ ప్రభుత్వం దగ్గర లేదని అన్నారు. వ్యాక్సిన్ల ధర విషయంలోనూ కేంద్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదన్న అనుమానాన్ని భట్టి వ్యక్తం చేశారు. అన్ని పనులు పక్కన పెట్టి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు. అక్రమంగా చెరువును ఆక్రమించి హాస్పిటల్ కట్టిన మల్లారెడ్డిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి ఆసుపత్రి ముందు.. ఐసొలేట్ సెంటర్ గా మార్చాలని ఆందోళన చేసిన ఎన్.ఎస్.యూ.ఐ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దారుణమని భట్టి చెప్పారు.
చదవండి: ‘కేసీఆర్ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’
Comments
Please login to add a commentAdd a comment