CM Jagan Slams Chandrababu Naidu At Mydukur Public Meeting, Details Inside | Sakshi
Sakshi News home page

CM Jagan Mydurkur Meeting: 75 ఏళ్లు వచ్చినా చం‍ద్రబాబులో పశ్చాత్తాపం లేదు

Published Tue, Apr 30 2024 2:52 PM | Last Updated on Tue, Apr 30 2024 7:11 PM

CM jagan Slams Chandrababu At mydukur Meeting

సాక్షి, కడప: చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తొస్తాయని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా.. కనీసం పశ్చాతాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని.. పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు.

కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్‌ మంగళవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మేనిపెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోమొస్తుందని విమర్శించారు.  మన ప్రభుత్వ స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని దుయ్యబట్టారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చేసిన స్కీములేమిటని ప్రశ్నించారు.

‘మైదుకూరు సిద్ధమా.. ఇంతటి ఎండలో కూడా చెరగని చిరు చిరునవ్వుల మధ్య ఏమాత్రం కూడా ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు. 

58 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు. 
ప్రతిఒక్కరూ కూడా నేను చెప్పేవి బాగా ఆలోచించమని కోరుతున్నాను. గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయాలు డీబీటీగా, 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్ధానాల అమలు, గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు, చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా లంచాలు, వివక్ష లేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటివద్దకే పథకాలు, చేయిపట్టుకుని నడిపించే వైద్యం, వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా సామాజిక న్యాయం జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఈ 58 నెలలకాలంలోనే జరిగిన విప్లవాత్మక మార్పులు. మరి ఇలాంటి మార్పుల మధ్య మే 13వ తారీఖున అంటే రెండు వారాలు కూడా సరిగా లేవు. మే 13వ తారీఖున ఎన్నికలు జరగనున్నాయి.

 పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. 

నేను మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్‌కు, ఒక చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధం కాదు. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ గెలుపునకు అర్థం.. ఈ విప్లవాత్మక మార్పులు, ఈ పథకాలన్నీ కొనసాగింపు, మరింతగా రెండడుగులు ముందుకు వేయడం. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే దాని అర్థం.. పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. 

చంద్రబాబు జీవితం అంతా మోసాలు, వెన్నుపోట్లు, కుట్రలే. 

ఈ మధ్య చంద్రబాబు వయస్సు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా 75 సంవత్సరాలు వచ్చాయి కదా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనేలేదు. నేను వరుసబెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల లిస్టు చదువుతుంటే ఈ చంద్రబాబుకు పిచ్చికోపం వస్తోంది. నేను చదివే స్కీముల లిస్టు గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మనందరి పాలనలో ఈ 58 నెలల్లోనే ఎలా అడుగులు పడ్డాయో ఒకసారి చూడమని అడుగుతున్నాను. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3వేల పెన్షన్ కానుక.. గతంలో ఎప్పుడూ చూడలేదు, గతంలో ఎప్పుడూ జరగలేదు. 

పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో నాడు-నేడు, బడి తెరిచే సమయానికే విద్యాకానుక, బడిలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, టోఫెల్ క్లాసులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ట్యాబ్లు కనిపిస్తున్నాయి, క్లాస్ రూముల్లో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక పేజీ తెలుగు ఒకపేజీ ఇంగ్లీష్ లో ఉన్న టెక్స్ట్ బుక్స్ కనిపిస్తున్నాయ్, పూర్తి ఫీజులు చెల్లిస్తూ పెద్ద చదువులకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరిక్యులమ్ లోకి ఆన్ లైన్ సర్టిఫైడ్ కోర్సులుగా కనిపిస్తున్నాయి. బడులకు పిల్లలను పంపే తల్లులు ఆలోచన చేయమని మీ అందరితో అడుగుతున్నాను. 

ఇవన్నీ కూడా నేను ఏదైతే చదువుతున్నానో, ఏదైతే చెప్తున్నానో గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు కనిపిస్తున్నాయి. బడులకు పిల్లలను పంపే తల్లులకు ప్రోత్సాహమిస్తూ అమ్మఒడి.. గతంలో ఎప్పుడూ లేదు. పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ఒక మంచి అన్నగా, ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఈరోజు అమ్మఒడి అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ చేయూత, అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మలకు అండగా ఓ ఆసరా, ఓ వైఎస్సార్ సున్నావడ్డీ. అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ల పేరిటే రిజిస్ట్రేషన్, అందులో ఏకంగా నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, అక్కచెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, వారికి రక్షణగా వాళ్ల ఫోన్లలోనే దిశ యాప్.. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఏకంగా చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లతో మహిళా సాధికారత. 

ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో గతంలో ఎప్పుడూ జరగనివిధంగా కనిపిస్తున్నాయి. రైతన్నలకు రైతుభరోసా, ఇ-క్రాప్, ఉచిత పంటలబీమా, పగటిపూట రైతన్నలకు 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్‌పుట్ సబ్సిడీ, గ్రామాల్లోనే రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ రైతన్నలకు అండగా ఈరోజు మన ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి. 

పేదవాడికి అండగా విస్తరించిన ఆరోగ్యశ్రీ. 

పేదవాడికి తోడుగా, పేదవాడికి అండగా.. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా చేయిపట్టుకుని నడిపించే ఆరోగ్య ఆసరా, ఇంటికే వైద్యం అందిస్తూ ఆరోగ్య సురక్ష, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్.. పేదలందరికీ కూడా తోడుగా, ఆరోగ్యంగా అండగా ఉండనిస్తూ. ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నానో గతానికి భిన్నంగా ఈరోజు కనిపిస్తున్నాయి. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ లాయర్లకు లా నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్ననేస్తం, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర, నా అక్కచెల్లెమ్మలకు, చిన్న చిన్న షాపుల్లో వ్యాపారం చేసుకుంటున్న రోడ్డు పక్కనే ఉన్న నా అన్నదమ్ములకు తోడుగా ఓ చేదోడు, తోడు. ఎంఎస్ఎంఈలకు గతంలో చూడనివిధంగా సపోర్ట్. 

స్వయం ఉపాధి రంగానికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా ఈరోజు అడుగులు కనిపిస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గతంలో కూడా ఎప్పుడూ చూడనివిధంగా ఈరోజు గ్రామగ్రామాన గ్రామ, వార్డు సచివాలయాలు కనిపిస్తున్నాయి. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, గ్రామగ్రామాన కనిపిస్తున్నాయి. ఇంటివద్దకే పౌరసేవలు, లంచాలు వివక్షలేని పథకాలు వస్తున్నాయి. నేను చెప్పేవన్నీ కూడా గతంలో ఎప్పుడూ చూడనివిధంగా జరుగుతున్న మార్పులు. నాడు-నేడుతో బాగుపడ్డ హాస్పిటళ్లు, నాడు-నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, పిల్లల చదువులు. 

ఇవి నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ మచ్చుకు కొన్ని.. గడగడ మీ బిడ్డ చదివితే, గడగడ మీ బిడ్డ నోటికి వస్తే మచ్చుకు కొన్ని ఈరోజు మీ బిడ్డ మీ అందరితోనూ పంచుకున్నాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతానికి భిన్నంగా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా, జరగనివిధంగా ఏకంగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు.. మరొక్కసారి చెబుతున్నా ఏకంగా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్లిపోతున్నాయి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా? అన్నది ప్రతి ఒక్కరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. మరి చంద్రబాబును నీ స్కీములు ఏమిటని అడుగుతున్నాను. 14 ఏళ్లు, 3సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీపేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతున్నాను. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదా.. 3సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీపేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతున్నాను. 

బాబూ అండ్ బ్యాచ్ మీ సంస్కారానికి నమస్కారం. 

మీ బిడ్డ, మీ జగన్, ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం వస్తోంది. బాగా కోపం వస్తోంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? అని చెప్పి ఈనాడుకు కోపం వస్తోంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తోంది, టీవీ5కి కోపం వస్తోంది, దత్తపుత్రుడికి కోపం వస్తోంది, వదినమ్మకు కోపం వస్తోంది.. ఇలా వీరందరికీ కూడా పిచ్చిపిచ్చిగా కోపం వస్తోంది. వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్‌కు కూడా కోపం వస్తోంది. మనకు కౌంటర్ గా వారు కూడా లిస్టులు చదువుతున్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీమ్ ల లిస్టులు కాదు, ఆ లిస్టులు నా మీద తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. ఇవి ప్రతిరోజూ కూడా గడగడ చదివేస్తున్నారు. 

నేను అడుగుతున్నాను. అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తున్నాను... ఎంతటి దారుణంగా మాట్లాడుతున్నారో తెలుసా వీళ్లంతా.. జగన్ ను మనిషి అనాలో, రాక్షసుడు అనాలో చంద్రబాబుకు అర్థంకావట్లేదట. జగన్‌ను ఎందుకు చంపకూడదు? అని అడుగుతాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. పనిలోపనిగా జగన్‌ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు. మొన్న నందికొట్కూరులో అన్న మాటలివి. మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలివి. నిజంగా నేను అడుగుతున్నాను. చేతగానివాడికి కోపం ఎక్కువ. 

నువ్వు పేదలకు చేసిన మేలేంటి చంద్రబాబూ... 

బాబు.. ఓ చంద్రబాబు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేసావా అంటే సమాధానం రాదు. కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్‌ను తిట్టి పెడితే ఏం ప్రయోజనం? ఎవరు ఇంటింటికీ మంచి చేశారు, ఎవరు అందరినీ మోసం చేసారు, వారి చరిత్ర ఏంటి అందరికీ తెలుసు. 

అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి.. 

అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి 2014లో ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్దానాలు చూద్దాం వీరి విశ్వసనీయత ఏమిటో చూద్దాం. 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో, చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికీ పంపిన పాంప్లెట్ ఇది. ఈటీవీ చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా ఊదరగొట్టారు. అక్కచెల్లెమ్మల మెడలో మంగళ సూత్రం ఒక చెయ్యి లాగేస్తుంటే మరో చెయ్యి అడ్డుకున్న యాడ్ గుర్తుందా...బాబొస్తున్నాడు అనే అడ్వర్టైజ్ మెంట్ అది. బాబు మేనిఫెస్టోలో మొదటి హామీ రూ.87,612 కోట్ల రుణమాఫీ- చేసాడా? రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు అన్నాడు- రూ.12,205 కోట్లలో ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా?

 మూడో హామీ ఆడబిడ్డ పుడితే 20వేలు బ్యాంకుల్లో వేస్తానన్నాడు. ఎవ్వరికైనా ఒక్కరూపాయి అయినా వేసాడా? నాలుగో హామీ ఇంటింటికీ ఓ ఉద్యోగం, ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2వేలు నిరుద్యోగభృతి అన్నాడు, ఐదేళ్లకు కలిపి రూ.1,20,000 ఇచ్చాడా? అర్హులందరికీ మూడుసెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇల్లు అన్నాడు. ఎవ్వరికైనా ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చాడా? రూ.10వేలకోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా? విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తా అన్నాడు చేశాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి అన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్‌సిటీ అన్నాడు జరిగిందా? మైదుకూరులో కనిపిస్తోందా?

 ఈ 58 నెలల్లో మీ బిడ్డ చేసిన పనులు చెప్పాను. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీ నెరవేర్చలేదు. కనీసం ప్రత్యేక హోదా కూడా తేలేదు. ఇలాంటి వ్యక్తిని నమ్మాలా? మళ్లీ ఇదే ముగ్గురు ఇవాళ సూపర్‌ సిక్స్‌ అంటున్నారు. కొత్త మేనిఫెస్టో అంటున్నారు. కొత్త మోసాలు, కొత్త అబద్ధాలు తెస్తున్నారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్ అంటున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్‌ కారు అంటున్నాడు నమ్ముతారా? వీళ్ల మోసాలకు, అబద్ధాలకు మనం గట్టిగా బదులివ్వాల్సిన అవసరం ఉంది.

 లంచాలు, వివక్ష లేని పాలన కోసం ఫ్యాను కే ఓటేయండి.

 వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా? పేదవాడి భవిష్యత్ మారాలన్నా? పథకాలన్నీ కొనసాగాలన్నా? లంచాలు, వివక్షలేని పాలన జరగాలన్నా? మన పిల్లలు, బడులు, చదువులు బాగుపడాలన్నా? మన వ్యవసాయం, హాస్పటళ్లు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా.. మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి. 

మన ప్రభుత్వం వచ్చాక రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసాం. కొన్ని అనివార్యకారణాల వల్ల, కరోనా వల్ల అయితేనేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల అయితేనేమి అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టు చేయలేకపోయాం. నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు పడ్డాయి, అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి. కాబట్టి రాజోలి ప్రాజెక్టు సంబంధించి ప్రాముఖ్యత ఏమిటి అని మనకు అంత అనిపించలేదు. కానీ ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా పడటంతో ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత తెలుస్తోంది. 

వచ్చే టర్మ్‌లో కచ్చితంగా రాజోలి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మీ చల్లని దీవెను ఆశీస్సులు కోరుతున్నాం. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్రాన్ని మారుస్తున్నాడంటే అందుకు కారణం మీరు చూపుతున్న ప్రేమానురాగాలే. అవే నన్ను అడుగడుగునా కాపాడుతున్నాయి. తోడుగా ఉన్నాయి. అవే దీవెనలు ఆశీర్వాదాలు, మీ బిడ్డ పట్ల, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పట్ల చూపించాలని కోరుకుంటున్నాను అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement