సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థను.. ఇప్పుడు దుర్మార్గంగా మార్చేశారని సీఎం కేసీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఆయన ప్రసంగిస్తూ.. మహారాష్ట్రలో కీలకమైన ఓ ఫైల్‌ను అక్కడి గవర్నర్ ముందుకు కదలనీయకుండా దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. తమిళనాడులోనూ ఓ బిల్లు విషయంలో అదే పరిస్థితి. మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, తమిళనాడు.. ఇలా ఏ రాష్ట్రం చూసినా గవర్నర్‌ల పంచాయితీ చూస్తున్నాం.
దివంగత ఎన్టీఆర్.. పార్టీ పెట్టినప్పుడు మేమూ ఆయనతో పని చేశాం. అద్భుతమైన మెజార్టీతో ఆయన అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా ఇదే దుర్మార్గమైన రీతిలో గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి.. స్వచ్ఛమైన పాలన అందించిన ఎన్టీఆర్‌ను సీఎం పీఠం నుంచి దించేశారు. ఆ తర్వాత ఏం జరిగింది..
ఇదెక్కడో భారత రామాయణ గాథలు నుంచి చెప్తోంది కాదు. ఇదే హైదరాబాద్ గడ్డపైన జరిగింది. తామే గొప్పనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. మెడలు వంచి ఎన్టీఆర్‌ను మళ్లీ సింహాసనం మీద కూర్చోబెట్టారు తెలుగు ప్రజలు. ఎన్టీఆర్‌తో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్ ఏమయ్యాడు?.. చివరకు తొలగించబడ్డాడు.. అవమానకర రీతిలో రాష్ట్రం విడిచి వెళ్లిపోయాడు.
జరిగిన చరిత్రే కదా. దాని నుంచైనా బుద్ధి రావొద్దా? ఇది చూసైనా ప్రజాస్వామ్యంలో పరిణితి నేర్చుకోవద్దా?. కానీ, ఇప్పుడేం జరుగుతోంది?.. ఉల్టా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వక్రమార్గంలో.. రాజ్యాంగబద్ధమైన ఒక పదవిని దుర్వినియోగపరుస్తున్నారు అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్.
సంబంధిత వార్త: కావాల్సింది రాజకీయ ఎజెండా కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా
Comments
Please login to add a commentAdd a comment