నేను చచ్చినా సరే ఆ సంస్కరణలు అమలు కానివ్వం: సీఎం కేసీఆర్‌ | CM KCR Strong Warning To BJP And Narendra Modi At Yadadri Tour | Sakshi
Sakshi News home page

CM KCR: నేను చచ్చినా సరే ఆ సంస్కరణలు అమలు కానివ్వం: సీఎం కేసీఆర్‌

Published Sat, Feb 12 2022 5:12 PM | Last Updated on Sat, Feb 12 2022 6:05 PM

CM KCR Strong Warning To BJP And Narendra Modi At Yadadri Tour - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: మోదీ ప్రభుత్వం మెడమీద కత్తిపెట్టి కరెంట్‌ సంస్కరణ పేరుతో మీటర్లు పెట్టించిందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం లేకుంటే ఇవ్వబోమని బీజేపీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ఈ మేరకు రాయగిరిలోని బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీని తరిమి తరిమి కొట్టాలని సూచించారు. మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు దేశాన్నినాశనం చేసిందని, మోదీ ప్రభుత్వం ఏ రంగానికీ న్యాయం చేయలేదని మండిపడ్డారు.

పిచ్చి ముదురుతోంది
‘సంగతి చూస్తాం అంటున్నారు.. ఏం చూస్తారు కేసీఆర్‌ సంగతి. మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది. మోదీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చాయి. ఏడాదిపాటు రైతుల్ని ఏడిపించారు. రైతుల్ని అవమానించారు. గుర్రాలతో తొక్కించారు. చివరకు రైతుల మీద కార్లు కూడా ఎక్కించారు. నేను చచ్చినా సరే తెలంగాణలో విద్యుత్‌ సంస్కరణలు అమలు కానివ్వం. తెలంగాణకు ఎందుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మతతత్వం బీజేపీ ఉంటే.. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వస్తారా. సిగ్గుపడాలి నరేంద్రమోదీ. 

కర్ణాటకలో మత పిచ్చి లేపారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. సిలికాన్‌ వ్యాలీలో ఆడబిడ్డల మీద, విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయి. విద్యార్థుల మధ్య మత కలహం పెడుతోంది బీజేపీ. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా. మోదీ ఉజ్వలమైన పరిపాలనలో పరిశ్రమలు మూతపడటం నిజం కాదా. ఏ రంగానికి మేలు చేసింది బీజేపీ ప్రభుత్వం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.
చదవండి: Hyderabad: స్వచ్ఛ సాగర్‌గా హుస్సేన్‌సాగర్‌

అస్సాం సీఎంను  బర్తరఫ్‌ చేయాలి
రాహుల్‌ను ఉద్ధేశించి.. నువ్వు ఎవరికి పుట్టావంటూ అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ తప్పుపట్టారు. ‘అస్సాం బీజేపీ సీఎం రాహుల్‌ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ మాటలు వింటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఇదా మన సంప్రదాయం. మోదీ, నడ్డా చెప్పాలి. హిందూ ధర్మం ఇదే చెబుతోందా. మోదీజీ ఇదేనా నీ సంస్కారం, ఇదేనా నీ భాష. అస్సాం సీఎం ఇలా దిగజారి మాట్లాడవచ్చా.. అహంకారమా.. కళ్లు నెత్తికెక్కాయా. అస్సాం సీఎంను మోదీ బర్తరఫ్‌ చేయాలి.’ అని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement