అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On BRS Govt And Adani | Sakshi
Sakshi News home page

అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్‌

Published Tue, Nov 26 2024 4:46 AM | Last Updated on Tue, Nov 26 2024 4:47 AM

CM Revanth Reddy Comments On BRS Govt And Adani

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. చిత్రంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

నేనేదో అప్పనంగా తీసుకున్నాననే చర్చ జరగడం ఇష్టం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని అదానీ సంస్థకు లేఖ రాశాం

నిధులు వద్దన్నంత మాత్రాన పాత ఒప్పందాల రద్దు సులువు కాదు

అసలు పెట్టుబడుల విషయంలో బీఆర్‌ఎస్‌ విధానమేంటి? 

గతంలో వారు అదానీతో ఒప్పందాలు చేసుకున్నందుకు కేసీఆర్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలా?.. వాళ్లది కడుపు మంట, కాకిగోల.. 

వాళ్లు అరుస్తుంటే మాకు ఉత్సాహం వస్తుంది 

ఢిల్లీ వెళ్లేది బీఆర్‌ఎస్‌ వాళ్లలా పైరవీల కోసం కాదు.. 

రాష్ట్రానికి నిధుల కోసం వెళ్తున్నా.. మహారాష్ట్ర ఫలితాలపై కిషన్‌రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర స్కిల్స్‌ యూనివర్సి­టీ కోసం అదానీ సంస్థ ఇస్తామని ప్రకటించిన రూ. 100 కోట్లను తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అదానీ గ్రూపు విషయంలో వివాదాలు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలకు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. 

సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు జంగా రాఘవరెడ్డి, రోహిణ్‌రెడ్డి, సామా రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్‌ వర్సిటీ వివాదాలకు లోనుకావడం తమకు ఇష్టం లేదని.. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడటం ద్వారా నిరుద్యోగులకు నష్టం చేసే వైఖరిని అవలంబించవద్దని విజ్ఞప్తి చేశారు. 

ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి కా­ర్ప­స్‌ ఫండ్‌ కింద నిధులు ఇచ్చేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయని సీఎం రేవంత్‌ చెప్పారు. అలాగే కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద రూ.100 కోట్లు ఇచ్చేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. కానీ అదానీ సంస్థ అదేదో తెలంగాణ రాష్ట్రానికో, ముఖ్యమంత్రికో అప్పనంగా రూ.100 కోట్లు ఇచ్చినట్టు చర్చ జరుగుతోందన్నారు. 

‘‘అదానీ సహా ఇప్పటివరకు ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదానీ సంస్థ నుంచి నిధులు తీసుకున్నారంటూ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం నాకు, కేబినెట్‌ సహచరులకు ఇష్టం లేదు. అందుకే మా అధికారి జయేశ్‌రంజన్‌ ద్వారా అదానీ సంస్థకు లేఖ రాశాం. ఆ సంస్థ ప్రకటించిన రూ.100 కోట్లు స్వీకరించడానికి సిద్ధంగా లేమని, ఆ నిధులు ప్రభుత్వానికి బదిలీ చేయవద్దని ఆ లేఖలో స్పష్టం చేశాం’’ అని రేవంత్‌ తెలిపారు. 

ఒప్పందాల రద్దు అంత సులువుకాదు 
అదానీ గ్రూపుతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా.. అది అంత సులువైనది కాదని, అలా రద్దు చేసుకుంటే వారు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ‘‘అయినా అదానీ ఫ్లైట్‌లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు. కేసీఆర్‌లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదు. అదానీతో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నవారు మాపై ఆరోపణలు చేస్తున్నారు. 

అసలు పెట్టుబడుల విషయంలో వారి విధానమేంటి? పెట్టుబడులు రాకపోతే తీసుకురాలేదంటారు. తెస్తే రద్దు చేసుకోవాలంటారు. అంటే గత ప్రభుత్వం అదానీ గ్రూపుతో జాతీయ రహదారులు, డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నందుకు కేసీఆర్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలా? వారి మీద కూడా కేసులు పెట్టాలా?’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. 

వాళ్ల కాకిగోలను పట్టించుకోబోం 
పెట్టుబడుల విషయంలో తాము ఎవరికీ ఆయాచిత లబ్ధి చేకూర్చబోమని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ‘‘2023లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయింది. 2024లో డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు మెదడు కోల్పోయింది. మీ కడుపు మంట మాకు తెలుసు. మీ దుఃఖం మాకు తెలుసు. మీ కాకిగోలను పట్టించుకోం. 

మీలాంటి వాళ్లు అరుస్తుంటే మాకు ఉత్సాహం వస్తుంది. మా కార్యకర్తలు సంతోషపడతారు. మీ క్షోభను చూస్తుంటే అప్పుడప్పుడు కోపం వస్తుంది. అయినా ఏకాగ్రత, కార్యదీక్షతో మేం ముందుకెళుతున్నాం’’ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలను ఎద్దేవా చేశారు. 

ఆ ఎన్నికల్లో వచ్చింది లేదు.. పోయింది లేదు 
జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఉప ఎన్నికలపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ... ఆ ఎన్నికల వల్ల ఎవరికీ వచ్చింది లేదని, ఎవరికీ పోయింది లేదని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. జార్ఖండ్‌లో ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. బెంగాల్‌లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. 

దేశంలోని రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మోదీని ఓడించి రాహుల్, ఖర్గేల నాయకత్వాన్ని బలపర్చారు. కేరళలోని వాయనాడ్‌ నుంచి ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో గెలిచారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ స్థానాన్ని మేమే గెలిచాం. దీన్నిబట్టి దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని, కిషన్‌రెడ్డిని ఛీ కొట్టారని అర్థమవుతోంది. అయినా కిషన్‌రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనను కేంద్ర మంత్రిగా చేయడం తెలంగాణ దురదృష్టం..’’ అని రేవంత్‌ విమర్శించారు. 

పైరవీల కోసం కాదు.. పెళ్లి కోసం ఢిల్లీ వెళ్తున్నా.. 
తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ గురించి వార్తలు వస్తున్నాయని సీఎం రేవంత్‌ అన్నారు. ఇప్పుడు తాను ఢిల్లీకి వెళ్తోంది లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమని చెప్పారు. సోమవారం రాత్రి వివాహానికి హాజరై... మంగళవారం ఉదయం తెలంగాణ ఎంపీలతో సమావేశమవుతామన్నారు. 

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించే వ్యూహంపై చర్చిస్తామని చెప్పారు. అందుబాటులో కేంద్ర మంత్రులెవరైనా ఉంటే కలుస్తామన్నారు. 

అయితే తాము బీఆర్‌ఎస్‌ నేతల్లా పైరవీలు చేసేందుకు, కాళ్లు పట్టుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకో, మోదీ ముందు మోకరిల్లేందుకో ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. కేంద్రాన్ని నిలదీసి అయినా నిధులు తెచ్చుకునేందుకు వెళుతున్నామని.. ఎన్నిసార్లయినా వెళ్తామని రేవంత్‌ చెప్పారు. 

కేంద్రం సమాఖ్య స్ఫూర్తితో ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇవ్వాలని ఇవ్వాలని... అదేమీ బీజేపీ ఖజానా కాదని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలైనా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా నిర్వహించాలనేది కాంగ్రెస్‌ పార్టీ విధానమని, తనది కూడా అదే అభిప్రాయమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

కేటీఆర్‌ జైలుకెళ్లినా సీఎం అయ్యే చాన్స్‌ లేదు! 
ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా అని కేటీఆర్‌ ఎదురుచూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారని పేపర్లలో వార్తలు చూసి తాను కూడా జైలుకెళితే ముఖ్యమంత్రి అవుతానని కేటీఆర్‌ అనుకుంటున్నారు. కానీ కేటీఆర్‌ కన్నా ముందు ఆయన చెల్లెలు కవిత జైలుకు వెళ్లింది. 

ఇప్పుడిక సీఎం అవకాశం కూడా కేటీఆర్‌కు లేదు. సీఎం పోస్టు కోసం కేసీఆర్‌ కుటుంబంలో పోటీ ఎక్కువైంది. పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలివిని వాడాలి. చిల్లర ఆలోచనలు మానాలి. ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో, బోడిగాడో చెప్పినట్టు ప్రభుత్వం వ్యవహరించదు. ఇక నుంచి ఆయన పేరును సైకో రామ్‌గా ఫిక్స్‌ చేయండి’’ అని ఎద్దేవా చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement