రోశయ్య వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా మారింది: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments At Roasaiah Death Anniversary HYD | Sakshi
Sakshi News home page

రోశయ్య వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా మారింది: సీఎం రేవంత్‌

Published Wed, Dec 4 2024 1:46 PM | Last Updated on Wed, Dec 4 2024 2:02 PM

CM Revanth Reddy Comments At Roasaiah Death Anniversary HYD

సాక్షి, హైదరాబాద్‌: దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌గా ఆవిష్కృతమైందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటించారు కాబట్టే రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పడిందన్నారు. మాజీ సీఎం రోశయ్య మూడో వర్ధంతి సందర్భంగా హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు.. రోశయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఏ రోజు కూడా తనకు ఈ పదవి కావాలని రోశయ్య అడగలేదని.. పార్టీ పట్ల నిబద్దత, క్రమశిక్షణ వల్లనే  పదవులు వచ్చాయని తెలిపారు

రోశయ్య ఉన్నప్పుడు నెంబర్‌-2 ఆయనే.. నెంబర్‌ 1 మాత్రమే మారేవారని సీఎం పేర్కొన్నారు. నెంబర్‌ 2లో ఉన్నా.. ఆయన ఎప్పుడూ తన పైన ఉన్నవారిని దాటిపోవాలని అనుకోలేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి అని రోశయ్య చెప్పారని గుర్తు చేశారు. 

‘చుక్క రామయ్య,ప్రొఫెసర్ నాగేశ్వర్,  రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడేందుకు నేను భయపడ్డాను. నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్‌కు పిలిపించుకొని ప్రోత్సహించారు. ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికి మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు. చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడింది.

ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదు. సీఎంగా, గవర్నర్ గా,వివిధ హోదా ల్లో 50 యేళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారు. తమిళనాడు గవర్నర్‌గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు. కాని రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు. అ నాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు. రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు.

ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారు. నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారు. ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయపడలేదు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే  క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు. రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయి. 

సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారు. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుంది.రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం. నేను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో  రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లైవుతుంది.’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement